Telangana: రైతు రుణాల రీ షెడ్యుల్ పేరుతో భారీ మోసం.. లక్షలు దోచేసిన బ్యాంక్ ఉద్యోగి..!

| Edited By: Balaraju Goud

Aug 07, 2024 | 3:33 PM

బ్యాంకును నమ్మి వచ్చే ఖాతాదారుల సొమ్ము ఆ బ్యాంక్ లోనే అక్రమార్కులు స్వాహా చేసేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకుని కుచ్చుటోపి పెట్టేశారు.

Telangana: రైతు రుణాల రీ షెడ్యుల్ పేరుతో భారీ మోసం.. లక్షలు దోచేసిన బ్యాంక్ ఉద్యోగి..!
Bank Employee Fraud
Follow us on

బ్యాంకును నమ్మి వచ్చే ఖాతాదారుల సొమ్ము ఆ బ్యాంక్ లోనే అక్రమార్కులు స్వాహా చేసేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకుని కుచ్చుటోపి పెట్టేశారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై గుట్టుగా ఖాతాదారుల సొమ్మును లక్షల రూపాయలు స్వంతంగా వాడుకున్నాడు. బ్యాంక్‌లో పనిచేసే బిజినెస్ కోఆర్డినేటర్. విషయం తెలుసుకున్న బ్యాంక్ ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతాదారులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. బ్యాంక్‌లో బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న దేవేందర్ అనే వ్యక్తి అమాయక ఖాతాదారుల సొమ్మును హాంఫట్ చేశాడు. గ్రామాల నుంచి వచ్చే నిరక్షరాస్యులైన కస్టమర్స్ ను మోసం చేస్తూ వారి సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై ఖాతాదారుల రుణాలను నొక్కేశాడు.

బంగారు రుణాలు, క్రాప్ లోన్లను అసరాగా చేసుకొని లక్షల రూపాయలు మాయం చేశాడు దేవెందర్. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఖాతాదారులకు మాయమాటలు చెప్పి వారికి సహాయం చేసినట్లుగా నటించి వారి సొమ్మును మింగేశాడు. పూర్తిగా రుణాలు చెల్లించే రుణాలను రీ షెడ్యుల్ చేసి ఆ రుణాన్ని తన్నుకుపోయిన ఘటనలు చాలానే వెలుగు చూశాయి. బ్యాంక్ అధికారులకు సంబంధించిన ఐడిలు ప్రైవేటు వ్యక్తిగా ఉన్న బిజినెస్ కో ఆర్డినేటర్ కు ఇవ్వడం ద్వారా అమాయక ప్రజలను ఈజిగా బురిడీ కొట్టించాడు.

రైతులకు తెలియకుండానే లోన్ల రీ షెడ్యుల్:

గత ప్రభుత్వంలో రుణ మాఫీ పొందిన ఒక రైతు… మిగిలిన రూ.12 వేల రూపాయలు కట్టి రుణం మొత్తం పూర్తిగా చెల్లించాడు. అయితే మళ్ళీ ఋణం కావాలని కోరగా అన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. మేనేజర్ లేడు తర్వాత ఇస్తాం అన్నారు. చివరికి వివిధ కారణాలు చెప్పి అతనికి రుణానికి సంబంధించిన సొమ్ము ఇవ్వలేదు. కొద్ది రోజుల తర్వాత బ్యాంక్ మేనేజర్ ను కలిస్తే ఋణం తీసుకుని మళ్ళీ ఋణం తీసుకోవడానికి ఎలా వచ్చావని అడిగారు. అయితే ఘటనలో బిజినెస్ కో ఆర్డినేటర్ దేవేందర్ మొత్తం లక్ష రూపాయలు డ్రా చేసుకున్నాడు.

ఇలా చాలా మంది రైతులకు వివిధ కారణాలు చెప్పి వారి రుణాలను నొక్కేసాడు. తమ రుణాల సొమ్మును తన్నుకుపోయిన దేవేందర్ పై పోలీసులను ఆశ్రయించారు రైతులు, ఖాతాదారులు. బ్యాంక్ లో జరిగిన స్కాం కు సంబంధించి పూర్తి వివరాలు అందించారు. దీంతో ఘటనపై కొల్లాపూర్ సీఐ నేతృత్వంలో ప్రాథమిక విచారణ చేస్తున్నారు. పలువురు బ్యాంక్ సిబ్బందిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. కేసుపై పూర్తి అవగాహన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు.

బిజినెస్ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్న దేవేందర్ కు బ్యాంక్ సిబ్బంది సహకారం అందించినట్లు తెలుస్తోంది. వ్యవహారంపై లోతుగా విచారణ చేస్తే పలువురు బ్యాంక్ సిబ్బంది గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని ఖాతాదారులు చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..