Telangana: ఏపీ ప్రభుత్వంపై మరోసారి మంత్రి హరీష్ రావు సెటైర్లు.. ఈసారి టీచర్లను ఉద్దేశించి

|

Sep 29, 2022 | 3:54 PM

ఈ మధ్యకాలంలో ఏపీ సర్కార్‌పై వరుస కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు. ఈసారి టీచర్లను ఉద్దేశించి ఆయన పంచ్‌లు పేల్చారు.

Telangana: ఏపీ ప్రభుత్వంపై మరోసారి మంత్రి హరీష్ రావు సెటైర్లు.. ఈసారి టీచర్లను ఉద్దేశించి
Minister Harish Rao
Follow us on

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ అగ్గి రాజుకుంటోంది. మంత్రి హరీశ్‌రావు కామెంట్స్‌ కాక రేపుతున్నాయి. ఏపీ టార్గెట్‌గా తెలంగాణ మంత్రి వరుసబెట్టి విమర్శలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల నడుమ వివాదాలు కొత్తేం కాదు. మొన్నటిదాకా కృష్ణా నీళ్ల పంచాయితీ తేలకముందే.. ఇప్పుడు విద్యుత్‌ బిల్లుల జగడం రెండు రాష్ట్రాల్ని కుదిపేస్తోంది. ఈ లొల్లి ఇలా కంటిన్యూ అవుతుండగానే.. ఏపీపై మంత్రి హరీశ్‌రావు సెటైర్లు మరింత రచ్చ రాజేస్తున్నాయి. ఏపీని డైరెక్ట్‌గా టార్గెట్‌ చేస్తోన్న హరీశ్‌.. రోజుకో ఇష్యూను లేవనెత్తుతున్నారు. రెండు రాష్ట్రాలకు పోలిక పెడుతున్నారు. ఈసారి టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన హరీశ్‌ కీలక కామెంట్స్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయులకు మంచి ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్నారు. జగన్‌లా కేంద్రం మాటకు ఒప్పుకుని ఉంటే ఏటా 6 వేల కోట్లు వచ్చేవన్నారు. ఈ డబ్బులతో మరికొన్ని పథకాలు పెట్టేవాళ్లమన్నారు హరీశ్‌రావు.

ఇటీవల ఏపీ రోడ్లపైనా రియాక్టయ్యారు మంత్రి హరీశ్‌. తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ కొందరిని కలిసి తాను మాట్లాడానని.. కరెంట్ సరఫరా గురించి వాళ్లు అన్న మాటలు విన్న తర్వాత తెలంగాణ ఎంతో నయమనే విషయం తనకు అర్థమైందని అన్నారు. గతంలో ఏపీ రోడ్ల పరిస్థితిపై కామెంట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. మంత్రి వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఏపీ మంత్రుల రియాక్షన్‌తో రాజకీయ రగడ రాజుకుంది. గతంలో ఎక్కువగా వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది.

కేంద్రంపై కూడా విమర్శలు….

దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని మంత్రులు తెలిపారు. మిషన్‌ భగీరథ పథకానికి ఇరవైకి అవార్డులు వచ్చిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. తాగునీరు, విద్యుత్‌ సమస్యను సీఎం కేసీఆర్‌ శాశ్వతంగా పరిష్కరించారని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డులతోనైనా బీజేపీ నేతల ఆలోచన మారుతుందని హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు కేంద్రంపై కూడా హరీశ్ రావు పంచ్‌లు పేల్చారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్ర‌శంస‌లు గుప్పించి.. గ‌ల్లీల్లో మాత్రం విమ‌ర్శ‌లు చేయ‌డం కరెక్ట్ కాదన్నారు. అవార్డులు ఇస్తూ.. అవినీతి జరిగిందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. నిధులు ఇచ్చినప్పుడే కేంద్రానికి ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం