
ములుగు: ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగి, వర్షాలు తగ్గే పరిస్థితులు ఏర్పడితే ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క తెలిపారు. తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా అధికారులకు సూచనలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాలకు నిల్వ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రామప్ప చెరువులో 29 అడుగుల నీటి నిల్వ
ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని రామప్ప చెరువు, అక్కడి డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు అందుబాటులో ఉందని తెలిపారు. గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి చెరువులు, పరిసర ప్రాంతాలకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నీటి నిల్వలు, సరఫరా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు రోజుల్లో నీటిని విడుదల చేసేలా సంబంధిత అధికారులను మంత్రి సూచించారు.
రామప్ప చెరువులోని నీటిని డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసి ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గ్రామాల్లో నీటి లభ్యత, చెరువుల పరిస్థితి, భూగర్భ జలమట్టాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పనులతో నీటి సంరక్షణ
వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం, భవిష్యత్తు అవసరాలకు నిల్వ చేసుకోవడం అత్యంత కీలకమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, బోర్ల రీచార్జ్ వంటి పనులను విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో నీటి సంరక్షణ పనుల ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. సర్పంచులు, గ్రామస్థులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.
ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు వద్దు
అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి పరిణామాలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని సీతక్క అన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ
సాగునీటి అవసరాలతో పాటు ప్రజలకు తాగునీరు అందించడమే ప్రథమ ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. రామప్ప–లక్నవరం కాలువ వంటి ప్రతిపాదిత ప్రాజెక్టులతో పాటు ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..