Dussehra Festival Ravana Vadha: ఓ వైపు ఇల్లాలుగా ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూనే.. మరోవైపు ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. అయితే అన్ని ఉద్యోగాల్లో కొంచెం భిన్నమైంది పోలీసుగా విధులు నిర్వహించడం అని చెప్పవచ్చు. ఎందుకంటే అవసరం అయితే సమయం.. సందర్భం అని చూసుకోకుండా ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తన తోటి మహిళలు పండగలు సంతోషంగా జరుపుకుంటుంటే.. మహిళా పోలీసులు, అధికారులు తమ భాద్యతను నిర్వహిస్తూ ఉంటారు. తన విధులను నిర్వహించడంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనా వెనుకాడరని దసరా ఉత్సవాల్లో చోటు చేసుకున్న ఓ సంఘటన రుజువు చేస్తోంది.
చెడుపై మంచి విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటాం. దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ వధ కార్యక్రమం కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అలా ఉమ్మడి వరంగల్ లోని ఉర్స్ మైదనంలో రావణ సంహార కార్యక్రమం జరుగుతున్న సమయంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ విధులను నిర్వహిస్తున్నారు. అయితే తన పాపను ఎత్తుకుని గంటల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన జిల్లా కలెక్టర్ నేరుగా ఆమె వద్దకు వెళ్ళి పలకరించారు. అంతేకాదు మానవత్వంతో స్పందించి తన పక్క సీటులో డీసీపీని కూర్చోబెట్టారు. దీంతో డీసీపీ కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.