కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ కొత్త బంధం.. విద్య, పరిశోధన, స్టార్టప్‌లపై భారీ ప్లాన్! సీఎం రేవంత్‌ కీలక చర్చలు!

లండన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కీలక చర్చలు జరిపారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌లలో అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంబ్రిడ్జ్ సహకారం కోరారు. ఇరుపక్షాలు సంయుక్త ప్రాజెక్టులు, యువతకు ఇంక్యుబేషన్, మెంటరింగ్‌పై దృష్టి సారించనున్నాయి. ఇది తెలంగాణ ఉన్నత విద్యకు భారీ ముందడుగు.

కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ కొత్త బంధం.. విద్య, పరిశోధన, స్టార్టప్‌లపై భారీ ప్లాన్! సీఎం రేవంత్‌ కీలక చర్చలు!
Cm Revanth Reddy Meeting With Cambridge Representatives

Updated on: Aug 22, 2026 | 6:57 PM

లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం.. ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యావేత్తలు, ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది. తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై ఇరు వర్గాలు విస్తృతంగా చర్చించాయి.

సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు విస్తరించేందుకు ఉన్న అనుకూల పరిస్థితులను కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు తెలంగాణ బృందం వివరించింది.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి విజ్ఞాన, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని సీఎం కోరినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యా కార్యక్రమాలు, పరిశోధన ప్రాజెక్టులు, యువ పారిశ్రామికవేత్తలకు ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధి వంటి రంగాల్లో కేంబ్రిడ్జ్ సహకారం అందించాలని ప్రతిపాదించారు.

కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలపై వారు సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, సంయుక్త పరిశోధనలు చేపట్టడం, యువతలో వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు అవసరమైన ఇంక్యుబేషన్, మెంటరింగ్, అభివృద్ధి సహకారం అందించడం వంటి అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఈ రంగాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రత్యేక సహకార వ్యవస్థ, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థతో భాగస్వామ్యం ఏర్పడితే తెలంగాణలో ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యానికి ఈ భేటీ కీలక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us