Corona Dead Body: కరోనా మృతదేహాలు తారుమారు… మృతదేహాన్ని పూర్తిగా పరిశీలించకుండా అంత్యక్రియలు

|

Apr 17, 2021 | 6:06 AM

Corona Dead Body: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా మృతదేహం తారుమారైంది. పూర్తిగా పరిశీలించకుండా..

Corona Dead Body: కరోనా మృతదేహాలు తారుమారు... మృతదేహాన్ని పూర్తిగా పరిశీలించకుండా అంత్యక్రియలు
covid dead body
Follow us on

Corona Dead Body: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా మృతదేహం తారుమారైంది. పూర్తిగా పరిశీలించకుండా తమకు చెందిన మృతదేహమే అనుకుని అంత్యక్రియలు నిర్వహించేశారు. తీరా మృతదేహానికి సంబంధించిన బంధువులు ఆరా తీసే వరకు అసలు విషయం బయటపడింది.
నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. జిల్లా కేంద్రంలోని అహ్మద్‌పుర కాలనీకి చెందిన మైనార్టీ మహిళ (78) కరోనాతో బాధపడుతూ రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక ఇదే సమయంలో గాయత్రినగర్‌కు చెందిన మరో మహిళ (65) కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ రెండు మృతదేహాలను ప్యాక్‌ చేసి పోస్టుమార్టం గది పక్కకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ రెండు మృతదేహాలకు సంబంధించిన బంధువులు ఎవరూ లేరు. ఇక గాయత్రినగర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మహిళ చనిపోయిందని గాయత్రినగర్‌ వాసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ప్యాక్‌ చేసి ఉన్న మృతదేహాన్ని పరిశీలించకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. అనంతరం మైనార్టీ వర్గం వారు వచ్చి తమ బంధువు మృతదేహం గురించి వెతకగా కనిపించలేదు.

దీంతో అనుమానం వచ్చి ఆస్పత్రి అధికారులు గాయత్రి నగర్‌ వాసులను పిలిపించారు. అక్కడ మృతదేహాలను మళ్లీ పరిశీలించగా, గాయత్రినగర్‌ మహిళ మృతదేహః అక్కడే ఉంది. అయితే అంతకు ముందు తీసుకెళ్లిన మృతదేహాన్ని చూడలేదని తెలుపడంతో మైనార్టీకి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు, అడిషనల్‌ కలెక్టర్‌ ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపారు. రెండు వర్గాల వారిని సముదాయించారు. దీంతో మైనార్టీ వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతదేహం తారుమారు కావడంపై ఆస్పత్రి అధికారులు విచారణ చేపడుతున్నారు.

ఇవీ చదవండి: Gandhi Hospital: మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్స్.. రేపటి నుంచి పూర్తిస్థాయిలో కరోనా సేవలు

CS meet CM KCR: మరికాసేపట్లో కేసీఆర్‌తో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక భేటీ.. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలుపై చర్చ