Cyber Scam: డేంజర్‌లో పింఛన్ దారులు.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్..

|

Oct 08, 2024 | 4:17 PM

పింఛన్ తీసుకునే వారందరూ ఏడాదికోసారి జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాలి. లేకపోతే వారికి ప్రతి నెలా వచ్చే పింఛన్ ఆగిపోతుంది. ప్రతి ఏటా నవంబర్ లో వీటిని అందజేయాలి. స్కామర్లు ఈ విషయాన్నిగుర్తించి, మోసాలకు పాల్పడుతున్నారు. పింఛనర్ల వాట్సాప్ నంబర్లకు నకిలీ సందేశాలు పంపిస్తున్నారు.

Cyber Scam: డేంజర్‌లో పింఛన్ దారులు.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్..
New Scam
Follow us on

అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. వివిధ రకాల పనులు చాలా సులువుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరక్కుండానే పనులు చేసుకునే అవకాశం లభించింది. ఇదే సమయంలో సైబర్ స్కాములు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజల అవసరాలను అలుసుగా తీసుకుని వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా పింఛన్ దారులను లక్ష్యంగా చేరుకుని కొత్త స్కాముకు తెరతీశారు. జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాలంటూ వాట్సాప్ లో నకిలీ మెసేజ్ లు పంపుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. అప్రమత్తంగా ఉండాలని పింఛన్ లబ్ధిదారులకు సూచిందింది.

జీవన్ ప్రమాణ్ పత్రం అంటే..

పింఛన్ తీసుకునే వారందరూ ఏడాదికోసారి జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాలి. లేకపోతే వారికి ప్రతి నెలా వచ్చే పింఛన్ ఆగిపోతుంది. ప్రతి ఏటా నవంబర్ లో వీటిని అందజేయాలి. స్కామర్లు ఈ విషయాన్నిగుర్తించి, మోసాలకు పాల్పడుతున్నారు. పింఛనర్ల వాట్సాప్ నంబర్లకు నకిలీ సందేశాలు పంపిస్తున్నారు. జీవన్ ప్రమాణ్ పత్రం అప్ డేట్ చేసుకోవాలని లింక్ లను పంపి, వారి వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్నారు. లింక్ లో కోరిన సమాచారం ఇవ్వకపోతే పింఛన్ ఆగిపోతుందని భయపెడుతున్నారు.

మోసం జరిగే తీరు..

  • ముందుగా పింఛన్ దారుల వాట్సాప్ నంబర్ కు మోసగాళ్లు నకిలీ మెసేజ్ పంపిస్తారు. తాము ప్రభుత్వ అధికారులమని పరిచయం చేసుకుంటారు.
  • పింఛన్ దారుల జీవన్ ప్రమాణ్ పత్రం కాల వ్యవధి పూర్తి కానుండడంతో కొత్తది సమర్పించాలని అడుగుతారు. లేకపోతే పింఛన్ రాదని భయపెడతారు.
  • ఒక లింక్ ను పంపి, దానిలో కోరిన వివరాలు నమోదు చేయాలని అడుగుతారు. దానిలోని పీపీవో నంబర్, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలను నింపాలని ఆదేశిస్తారు.
  • ఆ వివరాలన్నీ నమోదు చేస్తే మీ ఖాతాను హాక్ అవుతుంది. మీ డబ్బులను తస్కరిస్తారు.

జాగ్రత్త అవసరం..

  • ఇలాంటి మోసాలపై పింఛన్ లబ్ధిదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. జీవన్ ప్రమాణ్ పత్రాలను వాట్సాప్ ద్వారా సమర్పించే అవకాశం ఉండదు. అలా పంపించాలని అధికారులెవ్వరూ అడగరు.
  • జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాలంటూ వాట్సాప్ లో సందేశాలు వస్తే నమ్మకూడదు. లింక్ లను అస్సలు క్లిక్ చేయకూడదు.
  • వాట్సాప్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, పీపీవో నంబర్, వ్యక్తిగత సమాచారం పంపకూడదు.
  • కేవలం అధికార వెబ్ సైట్ లను మాత్రమే సందర్శించాలి. ముఖ్యంగా మీ బ్యాంకును సంప్రదించాలి. లేకపోతే అధికారిక సీపీఏవో వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించాలి.
  • ఇలాంటి మెసేజ్ లు వస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)కి ఫార్మార్డ్ చేయాలి. లేకపోతే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..