
Yash Thakur: టీమిండియా ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ న్యూజిలాండ్‌తో ఐదో వన్డే ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కానీ తొలి మ్యాచ్‌లోనే అతడికి చేదు అనుభవం ఎదురైంది. బ్యాటింగ్‌కు వచ్చిన యశ్ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. దీంతో వన్డే అరంగేట్రంలో డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో అతడు కూడా చేరాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలు కూడా ఉండటం విశేషం.
అరంగేట్రంలోనే యశ్‌కు నిరాశ
న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో భారత జట్టు తరఫున యశ్ ఠాకూర్ తొలిసారి బరిలోకి దిగాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు నాలుగు బంతులు ఆడాడు. కానీ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో టిమ్ సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో వన్డే అరంగేట్రంలోనే డకౌట్ అయిన 18వ భారత ఆటగాడిగా యశ్ నిలిచాడు.
సచిన్, ధోనీ, లక్ష్మణ్ కూడా ఈ జాబితాలోనే
వన్డేల్లో తొలి మ్యాచ్‌లోనే సున్నా పరుగులకు ఔటైన భారత ఆటగాళ్ల జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు. 1974లో బిషన్ సింగ్ బేడీ ఈ జాబితాలో మొదటి ఆటగాడిగా నిలిచారు. ఆ తర్వాత రోజర్ బిన్నీ, కృష్ణమాచారి శ్రీకాంత్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్లు కూడా తమ అరంగేట్ర వన్డేలో ఖాతా తెరవలేకపోయారు. ఇప్పుడు యశ్ ఠాకూర్ పేరు కూడా ఈ జాబితాలో చేరింది.
డకౌట్ అయిన భారత ఆటగాళ్లు వీరే
1974 – బిషన్ సింగ్ బేడీ
1979 – సురీందర్ ఖన్నా
1980 – రోజర్ బిన్నీ
1980 – యోగరాజ్ సింగ్
1981 – కృష్ణమాచారి శ్రీకాంత్
1984 – అశోక్ పటేల్
1985 – లాల్‌చంద్ రాజ్‌పుత్
1988 – సంజీవ్ శర్మ
1989 – సచిన్ టెండూల్కర్
1998 – వీవీఎస్ లక్ష్మణ్
1999 – జ్ఞానేంద్ర పాండే
2002 – జయప్రకాశ్ యాదవ్
2003 – ఆవిష్కార్ సాల్వీ
2004 – ఎంఎస్ ధోనీ
2005 – సురేశ్ రైనా
2006 – వసీం జాఫర్
2010 – శిఖర్ ధావన్
2026 – యశ్ ఠాకూర్
టీ20ల్లో ముందే అరంగేట్రం.. ఇప్పుడు వన్డేల్లోనూ
విదర్భకు చెందిన 27 ఏళ్ల యశ్ ఠాకూర్ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్. 2026 జూలైలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు వన్డేల్లోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్నాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో నిరాశపరిచినా, బౌలింగ్‌లో తన సత్తా చాటేందుకు అతడికి మరో అవకాశం ఉంటుంది.
209 పరుగులకే కుప్పకూలిన భారత్
ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో భారత్ బ్యాటింగ్‌లో తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ చెరో 46 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. రోహిత్ శర్మ 7, విరాట్ కోహ్లీ 5 పరుగులకే ఔటయ్యారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్, జాకబ్ డఫీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మాథ్యూ ఫిషర్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెయిర్ టిక్నర్, మైకేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..