
Team India: సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 ప్రపంచ కప్ టోర్నమెంట్‌తో తాను అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు విరాట్ కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు కింగ్ కోహ్లీ మరో ఏడాది పాటు తన ఆటతో అలరిస్తాడనే ఆనందం ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఈ లెజెండ్ ఆటగాడు మైదానంలో కనిపించరనే బాధ అభిమానులను వేధిస్తోంది. కోహ్లీ ఇప్పటికే టెస్టులు, పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ ఖాళీ చేసిన నంబర్ 4 స్థానాన్ని యువ సంచలనం శుభమన్ గిల్ అద్భుతంగా భర్తీ చేశాడు. కానీ వన్డేలలో గత 15ఏళ్లుగా నంబర్ 3 స్థానానికి ఎదురులేకుండా చేసిన కోహ్లీ తర్వాత ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.
వసీం జాఫర్ ఎంచుకున్న కొత్త వారసుడు ఎవరు?
భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈ అంశంపై స్పందిస్తూ ఒక ఆసక్తికరమైన పేరును తెరపైకి తెచ్చాడు. కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ లేదా యశస్వి జైస్వాల్ కాకుండా టీమిండియా టీ20 జట్టు వైస్-కెప్టెన్ తిలక్ వర్మ సరైన ప్రత్యామ్నాయం అని పేర్కొన్నాడు. కేవలం 5 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడిన తిలక్ వర్మ తన టాలెంటుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడని జాఫర్ కొనియాడాడు. విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడిన తర్వాత ఆ స్థానానికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయితే బాగుంటుందని, తిలక్ వర్మలో ఆ సత్తా పూర్తిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తిలక్ వర్మ ఆటతీరుపై జాఫర్ ప్రశంసలు
తిలక్ వర్మ ప్రదర్శనపై వసీం జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ ఆటగాడి వర్సటాలిటీ ఎంతో అద్భుతంగా ఉందని, గతంలో నంబర్ 3 స్థానంలో సెంచరీ సాధించిన తిలక్, ఆ తర్వాత జట్టు అవసరాలకు తగినట్లుగా నంబర్ 5 లేదా నంబర్ 6 స్థానాలకు కూడా సులభంగా అలవాటు పడ్డాడని జాఫర్ వివరించాడు. దేశవాళీ క్రికెట్‌లో దులీప్ ట్రోఫీలోనూ తిలక్ అద్భుతంగా పరుగులు సాధించాడని గుర్తుచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో యావరేజ్ కూడా అద్భుతంగా ఉన్నందున తిలక్ అన్ని ఫార్మాట్లలో రాణించగల సత్తా కలిగి ఉన్నాడని స్పష్టం చేశాడు.
రోహిత్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్
రోహిత్ శర్మ కూడా ఇదే ప్రపంచ కప్‌తో తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకనున్నాడు. హిట్‌మ్యాన్ స్థానంలో ఓపెనర్‌గా యువ దూకుడు బ్యాటర్ యశస్వి జైస్వాల్ జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే మరో ఓపెనర్ ఎవరు అనే దానిపై భవిష్యత్తులో స్పష్టత రానుంది. అభిషేక్ శర్మ వంటి విధ్య్వంసకర ఆటగాళ్లు రేసులో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో సెలక్టర్లు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ కప్ తర్వాత భారత జట్టులో జరిగే ఈ భారీ మార్పులు జట్టు రూపురేఖలను పూర్తిగా మార్చేయడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..