
USA Cricket: అమెరికా పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో అమెరికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో నమీబియాను 4 వికెట్ల తేడాతో ఓడించి ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ 2 ట్రోఫీని ముద్దాడింది. ఈ చారిత్రక విజయంతో 2027 వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌కు అమెరికా నేరుగా అర్హత సాధించింది.
కెప్టెన్ మోనాంక్ పటేల్ సెంచరీ
నమీబియా నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ అద్భుతమైన సెంచరీతో జట్టును ముందూండించి నడిపించారు. మోనాంక్ 108 పరుగులతో అదరగొట్టగా, స్మిత్ పటేల్ (50), షెహాన్ జయసూర్య (74) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తీవ్ర ఉత్కంఠ నడుమ మరో 7 బంతులు మిగిలి ఉండగానే అమెరికా ఈ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం సాధించింది.
నమీబియా పోరాటం వృథా
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. నమీబియా ఓపెనర్ మైఖేల్ వాన్ లింగెన్ భారీ షాట్లతో రాణించగా, కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ 76 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించారు. అమెరికాను కట్టడి చేసేందుకు నమీబియా బౌలర్లు ప్రయత్నించినప్పటికీ అమెరికా బ్యాటర్ల ధాటికి వారి వ్యూహాలు పారలేదు.
నేరుగా క్వాలిఫైయర్స్ రేసులోకి
లీగ్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో అమెరికా జట్టు లీగ్ విజేతగా నిలిచింది. టోర్నీలో మిగిలిన జట్లు ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా అమెరికా పాయింట్లను చేరుకోవడం సాధ్యం కాదు. దీంతో వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న వన్డే ప్రపంచ కప్ మెయిన్ టోర్నీకి అర్హత సాధించేందుకు అమెరికాకు మెరుగైన అవకాశం లభించింది.
అమెరికా క్రికెట్‌లో కొత్త శకం
గతంలో రెండు టీ20 ప్రపంచ కప్‌లలో ఆడి పెద్ద జట్లకు షాకిచ్చిన అమెరికా, ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ తమ సత్తా చాటుతోంది. క్వాలిఫైయర్స్‌లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే 2027 వన్డే వరల్డ్ కప్‌లో అమెరికా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అసోసియేట్ దేశాల నుంచి వరుస విజయాలు సాధిస్తూ అమెరికా క్రికెట్ సరికొత్త శిఖరాలకు చేరుకోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..