
SMAT 2026: టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొని 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.
15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి టాప్ ఆర్డర్ మంచి ఆరంభం ఇచ్చింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మొదటి నుంచే దూకుడుగా ఆడాడు. హైదరాబాద్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. చివరకు 21 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ ఏకంగా 285.71గా నమోదైంది.
ముషీర్ ఖాన్ హాఫ్ సెంచరీ
సూర్యకుమార్‌కు యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ కూడా చక్కటి సహకారం అందించాడు. కేవలం 24 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 23 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. అంతకుముందు అంగ్క్రిష్ రఘువంశీ 13 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టుకు వేగంగా పరుగులు అందించాడు. హార్దిక్ తమోరే 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే 5 బంతుల్లో 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సిక్సర్‌తో విజయాన్ని ఖాయం చేశాడు.
హైదరాబాద్ 172 పరుగులకే ఆలౌట్
అంతకుముందు టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ బ్యాటర్లు కొన్ని మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినా భారీ స్కోరు చేయలేకపోయారు. అభిరథ్ రెడ్డి 24 బంతుల్లో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోడిమెల హిమతేజ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. కెప్టెన్ చామ మిలింద్ 12 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. ప్రణవ్ వర్మ 14 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అయినా ముంబై బౌలర్ల ధాటికి హైదరాబాద్ 20 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది.
మాక్స్వెల్ స్వామినాథన్‌కు మూడు వికెట్లు
ముంబై బౌలర్లలో ఎడమచేతి వాటం స్పిన్నర్ మాక్స్వెల్ స్వామినాథన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే, సైరాజ్ పాటిల్ రెండేసి వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, అథర్వ అంకోలేకర్ తలో వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ముంబై 13.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి అందుకుంది. ఈ విజయంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మరిన్ని క్రీడ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..