Suryakumar Yadav: వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌కే ఈ గతి.. పాపం సూర్యాభాయ్ నీకే ఎందుకిలా ?

Suryakumar Yadav: ముంబై రంజీ ట్రోఫీ జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను సెలెక్టర్లు తప్పించారు. రెడ్ బాల్ క్రికెట్‌లో ఫామ్, రిథమ్ అందుకోవాలని రమేష్ పొవార్ స్పష్టం చేశారు. సిద్ధేష్ లాడ్ కెప్టెన్‌గా, 19 ఏళ్ల ఆయుష్ మాత్రే వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

Suryakumar Yadav: వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌కే ఈ గతి.. పాపం సూర్యాభాయ్ నీకే ఎందుకిలా ?
Suryakumar Yadav

Updated on: Oct 06, 2026 | 12:00 PM

Suryakumar Yadav: భారత టీ20 మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఛండీగఢ్‌తో జరగబోయే ముంబై మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు సూర్యాను సెలెక్టర్లు సెలక్ట్ చేయలేదు. టీమిండియా నుంచి వైదొలిగిన తర్వాత ముంబై జట్టులోనైనా చోటు దక్కుతుందని భావించిన అతనికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. రంజీ సీజన్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని సూర్య తెలిపినప్పటికీ, ఎంపిక కమిటీ అతన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.

ఆక్టోబర్ 11 నుంచి ముంబై తన రంజీ ట్రోఫీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టుకు సిద్ధేష్ లాడ్ నాయకత్వం వహిస్తుండగా, కేవలం 19 ఏళ్ల ఆయుష్ మ్హత్రేను వైస్ కెప్టెన్‌గా నియమించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇక టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉండటంతో అతనికి ఈ స్క్వాడ్‌లో చోటు లభించింది.

సూర్యకుమార్ యాదవ్ చివరిసారిగా జూన్‌లో జరిగిన ముంబై టీ20 లీగ్‌లో మాత్రమే ఆడాడు. ఈ మధ్యకాలంలో రెడ్ బాల్ క్రికెట్‌లో సరైన ఫామ్‌లో లేకపోవడం, ఫార్మాట్ మారడం వల్ల అతన్ని జట్టులోకి తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. అయితే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రమేష్ పొవార్ స్పందిస్తూ, “సూర్య పెద్ద మ్యాచ్ లీడర్. దాదాపు 18 నెలలుగా అతడు సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లు ఆడలేదు. కొన్ని మ్యాచ్‌లు ఆడి రిథమ్ సాధిస్తే కంబ్యాక్ ఇవ్వొచ్చు” అని స్పష్టం చేశారు.

ముంబై క్రికెట్‌లో ఎన్నో ఏళ్లుగా నమ్మకమైన ప్రదర్శన ఇస్తున్న సీనియర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా కెప్టెన్సీకి ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని అనుభవాన్ని పక్కనపెట్టి నేరుగా 19 ఏళ్ల మ్హత్రేను వైస్ కెప్టెన్‌గా చేయడం చర్చనీయాంశమైంది. అయితే స్క్వాడ్‌లో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, తుషార్ దేశ్‌పాండే లాంటి కీలక ఆటగాళ్లకు చోటు లభించింది.

టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ అయినప్పటికీ, ఫామ్ లేమి కారణంగా సూర్యాను ఇటీవల టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంత రాష్ట్ర జట్టులోనూ రంజీ మ్యాచ్‌లకు దూరమవ్వడం అతని కెరీర్‌ను క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టింది. త్వరలోనే సూర్య తన ఫామ్‌ను అందుకొని రెడ్ బాల్ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us