Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్యంపై ఆందోళన.. రంగంలోకి దిగిన మాజీ కెప్టెన్లు

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, వైద్య చికిత్సపై ఏడుగురు మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రెగ్ చాపెల్, అలెన్ బోర్డర్, స్టీవ్ వా సహా మాజీ కెప్టెన్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వోంగ్‌కు లేఖ రాశారు. ఖాన్‌కు తగిన వైద్యం, కుటుంబ సభ్యులు, న్యాయ సలహాదారులతో సంప్రదింపులు కల్పించాలని కోరారు. ఈ విజ్ఞప్తి రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు.

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్యంపై ఆందోళన.. రంగంలోకి దిగిన మాజీ కెప్టెన్లు
Imaran Khan

Updated on: Sep 16, 2026 | 10:31 AM

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఆయనకు అందుతున్న వైద్య చికిత్సపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఏడుగురు మాజీ కెప్టెన్లు ఆ దేశ విదేశాంగ మంత్రి పెనీ వోంగ్‌కు ఒక లేఖ రాశారు. గత మూడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై పాకిస్థాన్ ప్రభుత్వంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరపాలని వారు ఆ లేఖ ద్వారా గట్టిగా కోరారు.

ప్రస్తుతం అడియాలా జైలులో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్య చికిత్స అందడం లేదని వాపోయారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు పరిమిత అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే న్యాయపరమైన సలహాలు పొందేందుకు కూడా తీవ్ర ఆంక్షలు ఉన్నాయని వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు పేర్కొన్నారు. ఈ లేఖపై గ్రెగ్ చాపెల్, అలెన్ బోర్డర్, స్టీవ్ వా, మార్క్ టేలర్, ఇయాన్ చాపెల్, ఇయాన్ హ్యూజస్, బెలిండా క్లార్క్ తదితరులు సంతకాలు చేశారు. తాము ఏ రాజకీయ లేదా చట్టపరమైన వివాదాలకు మద్దతు ప్రకటించడం లేదని కేవలం తోటి క్రీడాకారుడి మానవ హక్కుల కోసం మాత్రమే ఈ అప్పీల్ చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.

ఇది పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత విషయమని తమకు తెలుసని, అయితే జైలులో ఉన్న ఏ వ్యక్తితోనైనా సరే మానవతా దృక్పథంతో ప్రవర్తించడం చాలా ముఖ్యమని ఆ దిగ్గజ క్రీడాకారులు అభిప్రాయపడ్డారు. రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మాజీ ఆటగాడి ప్రాణాలను కాపాడేందుకు సరైన వైద్యం అందేలా చూడాలని వారు కోరారు. కాగా, కొద్ది వారాల క్రితం సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 మంది మాజీ క్రికెటర్లు కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల ఇలాంటి ఆందోళనలే వ్యక్తం చేయడం గమనార్హం.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, ఆయన ప్రస్తుత దుస్థితికి సంబంధించిన అంశాలు ప్రపంచ క్రికెట్ వేదికలపై కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ – పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ సందర్భంగా లార్డ్స్ టెస్ట్ లంచ్ బ్రేక్ సమయంలో మాజీ క్రికెటర్ ఎథర్టన్.. ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్ ఖాన్, కాసిమ్ ఖాన్‌ల ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. జైలులో తమ తండ్రి పడుతున్న ఇబ్బందులు, క్షీణిస్తున్న ఆరోగ్యం గురించి వారు ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియా దిగ్గజాలు కూడా రంగంలోకి దిగడంతో ఈ అంశం అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us