Sandpaper Gate: నోరు విప్పకపోతే ఇబ్బందులే.. కొత్త చిక్కుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్..!

Ball Tampering Scandal: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ కీలక హెచ్చరిక చేశాడు. 2018 బాల్ టాంపరింగ్ వివాదంపై కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ చేసిన తాజా ఆరోపణలను కమిన్స్ ఖండించకపోతే కెప్టెన్సీలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నాడు.

Sandpaper Gate: నోరు విప్పకపోతే ఇబ్బందులే.. కొత్త చిక్కుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్..!
Ball Tampering Scandal Pat Cummins

Updated on: Nov 19, 2026 | 8:46 PM

Sandpaper Gate: ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. 2018లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ వివాదంలో కీలక పాత్ర పోషించిన కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలకలం రేపుతున్నాయి. బాల్ టాంపరింగ్ కుట్ర గురించి జట్టులోని అందరికీ తెలుసని బాన్‌క్రాఫ్ట్ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ.. పాట్ కమిన్స్‌కు కీలక హెచ్చరిక జారీ చేశాడు. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణలను కమిన్స్ నేరుగా ఖండించకపోతే కెప్టెన్సీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించాడు.

మళ్లీ తెరపైకి బాల్ టాంపరింగ్ వివాదం..!

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన విషయం అప్పట్లో ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించింది. ఈ వివాదంలో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై చర్యలు తీసుకున్నారు. అయితే తాజాగా బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలు ఈ పాత వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి.

బాల్ టాంపరింగ్ కుట్ర గురించి జట్టులోని ఆటగాళ్లందరికీ తెలుసని, కానీ ఆ వ్యవహారంలో తాను మాత్రమే శిక్షను అనుభవించాల్సి వచ్చిందని బాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నాడు. దీంతో అప్పట్లో తమకు ఈ కుట్ర గురించి తెలియదని చెప్పిన ఆటగాళ్ల వాదనలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇదే విషయంపై గతంలో ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలను పాట్ కమిన్స్ తీవ్రంగా ఖండించాడు. బాల్ టాంపరింగ్ ప్రణాళిక గురించి జట్టులోని అందరికీ తెలుసన్న ఖవాజా వాదనను పూర్తిగా అర్ధంలేనిదిగా అభివర్ణించాడు. ఇప్పుడు బాన్‌క్రాఫ్ట్ ఆరోపణలతో కమిన్స్ మరోసారి ఈ వివాదంపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కమిన్స్ విశ్వసనీయతకు పరీక్ష.. ఇయాన్ హీలీ హెచ్చరిక..!

బాన్‌క్రాఫ్ట్ చేసిన తాజా ఆరోపణలపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ స్పందించాడు. ఈ వ్యవహారాన్ని కమిన్స్ నేరుగా పరిష్కరించుకోవాలని సూచించాడు. లేదంటే జట్టు కెప్టెన్‌గా అతడి విశ్వసనీయతపై ప్రభావం పడుతుందని హెచ్చరించాడు.

SENతో మాట్లాడిన హీలీ.. బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను కమిన్స్ మరోసారి ఖండించకపోతే జట్టుకు నాయకత్వం వహించడం అతడికి కష్టమవుతుందని పేర్కొన్నాడు. గతంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కమిన్స్ చేసిన వ్యాఖ్యలతో అతడి విశ్వసనీయతకు కొంత నష్టం జరిగిందని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వకపోతే ఆటగాడిగా, కెప్టెన్‌గా అతడి వ్యక్తిగత ప్రతిష్ఠపై ప్రశ్నలు కొనసాగుతాయని హీలీ వ్యాఖ్యానించాడు.

కమిన్స్ కెప్టెన్సీ వదులుకోవాలా? హీలీ ఏమన్నాడంటే..!

బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి రావడంతో పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలా? అనే ప్రశ్న కూడా హీలీకి ఎదురైంది. దీనిపై ఆయన ఆసక్తికరంగా స్పందించాడు. కమిన్స్ కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

అయితే 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వివాదాన్ని విచారించిన తీరుపై మాత్రం హీలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పట్లో తొందరపాటుతో విచారణ చేపట్టారని, సంబంధిత వ్యక్తులతో పూర్తిస్థాయిలో మాట్లాడకుండానే నిర్ణయాలకు వచ్చారని విమర్శించాడు. మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడకూడదని అభిప్రాయపడ్డాడు. కమిన్స్ స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వేరే విషయమని కూడా పేర్కొన్నాడు.

స్టార్ బౌలర్ల ప్రతిష్ఠకు దెబ్బ..!

ఈ వివాదం కేవలం పాట్ కమిన్స్‌కే పరిమితం కాదని ఇయాన్ హీలీ అభిప్రాయపడ్డాడు. జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ వంటి సీనియర్ ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిష్ఠపైనా ఈ ఆరోపణల ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నాడు.

వీరి క్రికెట్ ప్రదర్శనలతో ఏర్పడిన వారసత్వానికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని, కానీ వ్యక్తిగత విశ్వసనీయత విషయంలో మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్నాయని హీలీ వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారంపై రాబోయే రోజుల్లో ఆటగాళ్లు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించాడు.

అంతేకాకుండా బాల్ టాంపరింగ్ వ్యవహారం 2018లో బయటపడిన దానికంటే ముందే జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని కూడా హీలీ వ్యక్తం చేశాడు. సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువ స్వింగ్ అయిన బంతులతో ఆస్ట్రేలియా బౌలర్లు విజయాలు సాధించి ఉండొచ్చని వ్యాఖ్యానించాడు. దీంతో బాన్‌క్రాఫ్ట్ తాజా ఆరోపణలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us