
Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలు అలాగే మైదానంలో పేలవమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జట్టు ఆటతీరు నానాటికీ దారుణంగా మారుతుండటంతో బ్రాడ్‌కాస్టర్లు ముందుకు రాక పీసీబీకి కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. దేశీయ అంతర్జాతీయ సీజన్‌కు సంబంధించి మీడియా హక్కుల విక్రయంలో బోర్డు ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడంతో ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పీసీబీకి భారీగా తగ్గిన ఆదాయం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ హోమ్ సిరీస్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కోసం బేస్ ధరను 60 కోట్ల పాకిస్థానీ రూపాయలుగా నిర్ణయించింది. అయితే జాతీయ అలాగే అంతర్జాతీయ ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్లు ఎవరూ కూడా ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. పాకిస్థాన్ జట్టు నిలకడలేమి ప్రదర్శన, పడిపోయిన బ్రాండ్ విలువ కారణంగా ఏ టెలివిజన్ నెట్‌వర్క్ కూడా ముందుకు రాలేదు. దీంతో చేసేది లేక పీసీబీ తన డిమాండ్‌ను భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. చివరికి ప్రభుత్వ ఛానెల్ అయిన పీటీవీ స్పోర్ట్స్‌తో కేవలం 35 కోట్ల రూపాయలకే ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. దీనివల్ల పీసీబీకి నేరుగా 25 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది.
అభిమానులు మొహం చాటేయడం అసలు కారణం
పాకిస్థాన్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలోనూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ఆ జట్టు ప్రదర్శన అత్యంత దయనీయంగా ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. అలాగే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోర పరాజయాలపాలైంది. గత రెండు టీ20 ప్రపంచ కప్‌లలో కనీసం సెమీఫైనల్ చేరలేకపోయింది. మరోవైపు ఇటీవల జరిగిన ఆసియా క్రీడల ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిపోయి స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్ల ఫామ్ కోల్పోవడం కూడా జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.
బ్రాడ్‌కాస్టర్ల వెనకడుగు
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై అభిమానుల్లో ఆసక్తి క్రమంగా తగ్గిపోవడం, టీవీ వ్యూవర్షిప్ గణనీయంగా పడిపోవడం వంటి కారణాల వల్ల ప్రకటనదారులు కూడా వెనకడుగు వేశారు. ఇంగ్లండ్ జట్టు రాక, శ్రీలాంకాతో ట్రై సిరీస్ ఉన్నప్పటికీ బ్రాడ్‌కాస్టర్లు ముందుకు రాకపోవడం పీసీబీలో కలవరం రేపింది. మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ బోర్డు తప్పుడు అంచనాల కారణంగా ఈ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మైదానంలో ఆటగాళ్ల చెత్త ప్రదర్శనే ఈ ఆర్థిక పతనానికి ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..