
Mohit Ulva: భారత్ అండర్-19 జట్టు ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన యంగ్ ప్లేయర్ మోహిత్ ఉల్వాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 26 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు చేసిన అతడు.. జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కొడుకు ప్రదర్శన చూసి అతడి తల్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
మా కొడుకు హీరో అయ్యాడు
మోహిత్ ఆటతీరుపై అతడి తల్లి మీడియాతో మాట్లాడుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. “మా కొడుకు హీరో అయ్యాడు. అందుకే మాకు చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు. తాను మ్యాచ్ చూశానని, చివరి ఓవర్లు చాలా బాగా అనిపించాయని తెలిపారు. మోహిత్ సాధించిన విజయంతో తమ ఇంట్లో ఇప్పటికీ దీపావళి పండగ జరుగుతున్నట్టుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కొడుకు భవిష్యత్తులోనూ ఇలాగే ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
రాత్రింబవళ్లు ప్రాక్టీస్
మోహిత్ క్రికెట్ కోసం ఎంత కష్టపడతాడో అతడి తల్లి వివరించారు. రోజూ చాలా సమయం ప్రాక్టీస్ చేస్తాడని, రాత్రింబవళ్లు కష్టపడతాడని చెప్పారు. ఇప్పటికీ సాధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని తెలిపారు. ఆటతో పాటు తిండి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుందని వెల్లడించారు. కొడుకు కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం దక్కిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ఓటమి అంచు నుంచి భారత్‌ను గెలిపించాడు
ఈ ఫైనల్లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 337 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో మోహిత్ ఉల్వా, మనల్ చౌహాన్ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 57 పరుగులు జోడించి భారత్‌కు విజయంపై ఆశలు కల్పించారు. మనల్ చౌహాన్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటైనా.. మోహిత్ మాత్రం చివరి వరకు క్రీజులో నిలిచాడు.
చివరి బంతికి ఫోర్.. భారత్‌కు ఆసియా కప్
చివరి ఓవర్లో భారత్ విజయానికి 8 పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో మోహిత్ బౌండరీ బాదడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు చేసి గెలిచింది. మోహిత్ 26 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శనకు అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. మరోవైపు ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి 57 పరుగులు ఇచ్చిన మోహిత్‌కు వికెట్ దక్కలేదు. అయినా బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించి జట్టుకు టైటిల్ అందించాడు. ఈ విజయంతో భారత్ తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.