IND vs NZ 5th ODI: భారత్ చారిత్రక విజయం.. న్యూజిలాండ్ 11 ఏళ్ల రికార్డు బద్దలు

IND vs NZ 5th ODI: ఐదో వన్డేలో 209 పరుగులే చేసిన టీమిండియా.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 22 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో న్యూజిలాండ్ గడ్డపై కివీస్‌కు ఉన్న వరుస విజయాల పరంపర ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నాలుగు అరుదైన రికార్డులు నమోదు చేసింది.

IND vs NZ 5th ODI: భారత్ చారిత్రక విజయం.. న్యూజిలాండ్ 11 ఏళ్ల రికార్డు బద్దలు
Ind Vs Nz 5th Odi

Updated on: Nov 15, 2026 | 7:55 PM

IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఐదో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 209 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టమేనని భావించినా.. భారత బౌలర్లు అద్భుతంగా పోరాడారు. కివీస్‌ను 187 పరుగులకే కట్టడి చేసి 22 పరుగుల తేడాతో గెలిచారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ గడ్డపై ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఓ రికార్డు కూడా ముగిసింది.

11 వరుస సిరీస్‌ల విజయాలకు బ్రేక్

న్యూజిలాండ్ జట్టు 2019 నుంచి స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది. అలా ఏకంగా 11 సిరీస్‌లను తన ఖాతాలో వేసుకుంది. కానీ భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో ఆ జట్టు పరాజయం పాలైంది. ఐదో వన్డేలో భారత్ గెలవడంతో కివీస్ విజయ పరంపరకు తెరపడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2019లో న్యూజిలాండ్ స్వదేశంలో చివరిసారిగా ఓడిన వన్డే సిరీస్ కూడా భారత్‌తోనే జరిగింది. ఇప్పుడు మరోసారి టీమిండియానే ఆ జట్టు విజయాల జోరుకు అడ్డుకట్ట వేసింది.

న్యూజిలాండ్ గడ్డపై అతి తక్కువ స్కోరు కాపాడిన భారత్

ఈ మ్యాచ్‌లో భారత్ చేసిన 209 పరుగులే కీలకంగా మారాయి. న్యూజిలాండ్ గడ్డపై ఆ జట్టుతో జరిగిన వన్డేల్లో భారత్ విజయవంతంగా కాపాడుకున్న అతి తక్కువ స్కోరు ఇదే. అంతకుముందు 2009లో నేపియర్‌లో 216 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకుంది. ఇప్పుడు మౌంట్ మాంగనూయ్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని కొత్త రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత్ కాపాడుకున్న అతి తక్కువ లక్ష్యాల జాబితాలో 1980లో పెర్త్‌లో 163 పరుగులు, 1986లో లాన్సెస్టన్‌లో 190 పరుగులు కూడా ఉన్నాయి. అయితే అవి న్యూజిలాండ్ గడ్డపై జరిగిన మ్యాచ్‌లు కావు.

ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండానే 396 పరుగులు

ఈ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. భారత్, న్యూజిలాండ్ జట్లు కలిపి మొత్తం 396 పరుగులు చేశాయి. కానీ రెండు జట్లలో ఒక్క బ్యాటర్ కూడా 50 పరుగుల మార్కును అందుకోలేదు. న్యూజిలాండ్ గడ్డపై జరిగిన పురుషుల వన్డేల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకుండా అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది నిలిచింది. అంతకుముందు 1981లో హామిల్టన్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 363 పరుగులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డును 396 పరుగులతో అధిగమించారు.

భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌ల్లో ఇదే అత్యధికం

ఒక్క బ్యాటర్ కూడా అర్ధ సెంచరీ చేయకుండా రెండు జట్లు కలిపి 396 పరుగులు చేయడం వన్డే చరిత్రలోనూ అరుదైన ఘటనే. ఇలాంటి మ్యాచ్‌ల మొత్తం స్కోర్ల జాబితాలో ఇది 13వ అత్యధిక స్కోరుగా నిలిచింది. భారత్ ఆడిన వన్డే మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఒక్క బ్యాటర్ కూడా 50 పరుగులు చేయకుండా నమోదైన అత్యధిక మ్యాచ్ స్కోరు ఇదే. దీంతో ఐదో వన్డేలో టీమిండియా నాలుగు కీలక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

అర్ష్‌దీప్, సిరాజ్ బౌలింగ్‌తో భారత్‌కు గెలుపు

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ చెరో 46 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఒక దశలో 64 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. కానీ భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. యశ్ ఠాకూర్ తన తొలి వన్డే వికెట్ సాధించాడు. చివరికి కివీస్ 187 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 22 పరుగుల తేడాతో గెలిచింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us