
క్రికెట్ క్యాలెండర్‌లో ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ టోర్నమెంట్లతో షెడ్యూల్ నిండిపోయింది. ఈ పరిస్థితుల్లో కొత్త పోటీలకు అవకాశం లేదని భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ స్పష్టం చేసినట్టు సమాచారం. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ ఆపరేషన్స్ వర్క్‌షాప్‌లో ఈ అంశంపై నెలల పాటు చర్చలు జరిగినా, కొత్త టోర్నమెంట్ ప్రతిపాదన లేకుండానే సమావేశం ముగిసింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆదాయాన్ని పెంచే మార్గాలపై ఐసీసీకి మెకిన్సే అండ్ కంపెనీ వ్యూహాత్మక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా టీ20 ఫ్రాంచైజీ జట్లతో వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం, ఖాళీగా ఉన్న షెడ్యూల్ విండోల్లో నాలుగు దేశాల టీ20 టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం వంటి ఆలోచనలు పరిశీలనకు వచ్చాయి.
ఈ ప్రతిపాదనలకు మూడు ప్రధాన క్రికెట్ బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆటగాళ్ల బిజీ షెడ్యూల్‌లో కొత్త టోర్నీలకు స్థలం లేదని అవి స్పష్టం చేశాయి. కొత్త పోటీని చేర్చాలంటే వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రస్తుత ప్రధాన టోర్నమెంట్లలో ఏదో ఒకదాన్ని తగ్గించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. అలాంటి మార్పు సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇక ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC)కు సంబంధించి మార్పు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి డబ్ల్యూటీసీని 9 జట్లతో ఉన్న ప్రస్తుత ఫార్మాట్ నుంచి 12 జట్లకు పెంచే ఆలోచన ఉన్నట్టు సమాచారం. ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, జింబాబ్వేలను కూడా టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్‌లో చేర్చే అవకాశం ఉంది. దీనిపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రణాళికను సభ్య బోర్డులకు పంపలేదు.
2031 వరకు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తమ ద్వైపాక్షిక షెడ్యూళ్లను ఖరారు చేసుకున్నట్టు నివేదిక పేర్కొంది. 2027 ఇంగ్లిష్ సమ్మర్‌లో తదుపరి డబ్ల్యూటీసీ యాషెస్‌తో ప్రారంభం కానుంది. 2028 ఆరంభంలో ఇంగ్లండ్ భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. 2029లో భారత జట్టు ఐదు టెస్టుల కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.