
Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం భారత క్రికెట్‌లో ఒక సువర్ణాధ్యాయానికి తెరదించినట్లయింది. ఆమె నాయకత్వంలో భారత్ వన్డే ప్రపంచకప్, ఆసియా గేమ్స్ స్వర్ణం వంటి చారిత్రాత్మక విజయాలను సాధించింది. ఈ మార్పుతో జట్టుకు చాలా కాలంగా వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధాన కొత్త సారధిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
బీసీసీఐ కీలక భేటీ
గువాహటిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఒక ముఖ్యమైన రివ్యూ మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఈ భేటీలో హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి మంధాన, ప్రధాన కోచ్ అమూల్ మజుందార్ పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా జట్టు ప్రదర్శన, రాబోయే ప్రపంచ టోర్నీల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలోనే కెప్టెన్సీ మార్పుపై స్పష్టత వచ్చినట్లు సమాచారం అందుతోంది.
సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
ఈ నిర్ణయంపై హర్మన్‌ప్రీత్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు. అందులో ఆమె “ఈ నిర్ణయం తీసుకోవడం నాకు ఎంతమాత్రం సులభం కాదు. దీనివెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, త్యాగాలు, భావోద్వేగాలు ఉన్నాయి. భారత మహిళా క్రికెట్ జట్టు కోసం నా రక్తం, చెమట, సమయం ధారపోశాను. అనేక సందర్భాల్లో జట్టు ప్రయోజనాల కోసం నా సొంత ఆటను, వ్యక్తిగత ఆశయాలను కూడా పక్కనపెట్టాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.
విమర్శలకు సమాధానం
కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ ఒక ఆటగాడిగా జట్టుకు సేవలు అందిస్తూ ఉంటానని ఆమె స్పష్టంచేసింది. గత కొంతకాలంగా ఆమె కెప్టెన్సీ విధానాలు, బ్యాటింగ్ ఫామ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ.. జట్టు మేలు కోసమే ప్రతీ నిర్ణయం తీసుకున్నానని, ఎలాంటి విమర్శలు వచ్చినా బాధ్యతను గర్వంగా మోశానని తెలిపింది. ప్రశాంతమైన మనస్సుతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది.
బ్యాటింగ్‌పై దృష్టి
కెప్టెన్సీ భారం దిగిపోవడంతో హర్మన్‌ప్రీత్ ఇకపై తన బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి సారించనుంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఆమెకు లభిస్తుంది. రాబోయే ముఖ్యమైన టోర్నమెంట్లకు ముందు కొత్త కెప్టెన్ కింద జట్టు కుదురుకోవడానికి కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుంది. భారత క్రికెట్‌పై తనకున్న ప్రేమ ఎప్పటికీ మారదని హర్మన్‌ప్రీత్ లేఖను ముగించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..