
Fastest T20I Fifty: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రికార్డు ఎవరి పేరు మీద ఉందనే చర్చ క్రికెట్ సర్కిల్స్‌లో ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ పేర్లు ఈ చర్చలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ.. టీ20ల్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ రికార్డులన్నింటిని తలదన్నేలా అగ్రస్థానంలో ఉన్న ఒక అసాధారణ రికార్డును బద్దలు కొట్టడం భవిష్యత్తులో ఏ ఆటగాడికైనా అంత సులభం కాదనే చెప్పాలి.
ప్రపంచ రికార్డు ఎవరి పేరు మీద ఉంది?
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డు నేపాల్ జట్టుకు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ (Dipendra Singh Airei) పేరు మీద ఉంది. సెప్టెంబర్ 27, 2023న మంగోలియాపై జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 10 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచంలోని ఏకైక బ్యాటర్ ఆయనే కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో నేపాల్ జట్టు ఏకంగా 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా కేవలం 50 బంతుల్లోనే 137 పరుగులు చేసి మరో రికార్డు సృష్టించాడు.
రెండో స్థానంలో యువరాజ్ సింగ్
ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన చారిత్రాత్మక మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6 సిక్సర్లు బాదిన యువీ, కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రియాకు చెందిన అబ్దుల్లా కోట్వా కూడా 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఈ జాబితాలో యువీతో కలిసి సంయుక్త రెండో స్థానాన్ని పంచుకుంటున్నాడు.
వైభవ్ సూర్యవంశీకి సవాల్‌గా మారిన రికార్డులు
ఇంగ్లాండ్ పర్యటనతో టీ20ల్లో అడుగుపెట్టిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, ఆ తర్వాత జింబాబ్వే టూర్‌లో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది తన సత్తా చాటాడు. భవిష్యత్తులో అతను మరెన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, 9 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన దీపేంద్ర సింగ్ రికార్డును అందుకోవడం మాత్రం ఏ బ్యాటర్‌కైనా అత్యంత కష్టతరమైన సవాల్‌గానే నిలుస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..