7 Matches in 1 Day : క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. జూన్ 17న ఒకే రోజు 7 అంతర్జాతీయ మ్యాచ్‌లు

7 Matches in 1 Day : జూన్ 17న క్రికెట్ అభిమానులకు భారీ విందు సిద్ధమైంది. భారత్ పురుషుల, మహిళల, ఇండియా-ఏ జట్లతో పాటు మొత్తం 7 అంతర్జాతీయ మ్యాచ్‌లు 16 గంటల పాటు జరగనున్నాయి. వన్డేలు, టీ20లు, టెస్ట్ మ్యాచ్‌లతో క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం నెలకొంది.

7 Matches in 1 Day : క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. జూన్ 17న ఒకే రోజు 7 అంతర్జాతీయ మ్యాచ్‌లు
Cricket Matches

Updated on: Jun 17, 2026 | 9:20 AM

7 Matches in 1 Day : క్రికెట్ అభిమానులకు జూన్ 17వ తేదీ ఒక మోస్ట్ స్పెషల్ డే కాబోతోంది. ఈ ఒక్క రోజులోనే అంతర్జాతీయ వేదికలపై ఒకటి, రెండు కాదు.. ఏకంగా 7 క్రికెట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఉదయం ప్రారంభమయ్యే మ్యాచ్‌లతో మొదలుపెట్టి అర్థరాత్రి దాటే వరకు దాదాపు 16 గంటల పాటు నాన్-స్టాప్ క్రికెట్ విందు కనువిందు చేయనుంది. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే భారత సీనియర్ మెన్స్ టీమ్, ఉమెన్స్ టీమ్, జూనియర్ ఇండియా-ఎ టీమ్‌లు అన్నీ ఒకే రోజు మైదానంలో గర్జించబోతున్నాయి.

ఉదయాన్నే ఇండియా-ఎ చావోరేవో పోరు

ఈ క్రికెట్ హడావిడి ఉదయాన్నే ఇండియా-ఎ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై-సిరీస్ వన్డే టోర్నమెంట్‌లో భాగంగా భారత్-ఎ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. టోర్నీలో ముందడుగు వేయాలంటే ఇండియా-ఎ జట్టుకు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, తుఫాన్ బ్యాటర్ తిలక్ వర్మల బ్యాటింగ్ పవర్ ఎలా ఉండబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మధ్యాహ్నం 1:30 గంటలకు సీనియర్ టీమ్ యాక్షన్

ఇక మధ్యాహ్నం 1:30 గంటల నుంచి భారత పురుషుల సీనియర్ జట్టు రంగంలోకి దిగుతుంది. లక్నో వేదికగా అఫ్గానిస్తాన్ జట్టుతో టీమిండియా రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్ కూడా గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని చూస్తోంది. అదే సమయంలో పురుషుల క్రికెట్ లోనే మరో ఆసక్తికర పోరు జరగనుంది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1:30 గంటలకే ప్రారంభం కానుంది.

రాత్రి 7 గంటలకు ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్

సాయంత్రం వేళ భారత మహిళల జట్టు వంతు రాబోతోంది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా తన రెండో లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టుతో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. వరల్డ్ కప్ రేసులో నిలవాలంటే భారత మహిళల జట్టుకు ఈ మ్యాచ్‌లో భారీ విజయం అవసరం. ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లోనే మరో రెండు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం 3:00 గంటలకు ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ జట్లు.. అలాగే రాత్రి 11:00 గంటలకు సౌతాఫ్రికా-పాకిస్తాన్ మహిళల జట్లు తలపడనున్నాయి.

టెస్ట్ క్రికెట్ లో మద్యం వివాదం కలకలం

పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ మజా కూడా ఈరోజు అభిమానులకు అందుబాటులో ఉంది. లండన్‌లోని ప్రసిద్ధ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టులో పెద్ద హైడ్రామా నడిచింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మద్యం వివాదంలో దొరికిపోవడంతో అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని జట్టు నుంచి తప్పించారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుకు స్టార్ బ్యాటర్ జో రూట్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us