6,6,6,6,4,4.. 18 బంతుల్లో విధ్వంసం.. 38 ఏళ్ల వయసులో ఈ దూకుడేంది సామీ..!

Andre Russell 46 off 18 balls: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఆండ్రీ రసెల్ బ్యాట్ ఇంకా శాంతించలేదు. అబుధాబి టీ10 లీగ్‌లో యూఏఈ బుల్స్‌తో మ్యాచ్‌లో 29/6 వద్ద కుప్పకూలిన అరేబియన్ ఏసెస్‌ను 18 బంతుల్లో 46 పరుగులతో ఒంటిచేత్తో గెలిపించాడు. బంతితో 12 పరుగులిచ్చి 3 వికెట్లు.. పోలార్డ్, నరైన్‌లనే బోల్తా కొట్టించాడు.

6,6,6,6,4,4.. 18 బంతుల్లో విధ్వంసం.. 38 ఏళ్ల వయసులో ఈ దూకుడేంది సామీ..!
Andre Russell 46 Off 18 Balls

Updated on: Nov 15, 2026 | 1:40 PM

Andre Russell 46 off 18 Balls: కొందరు ఆటగాళ్లు వయసుతో పాటు తగ్గుతారు. కొందరు వయసును వెనక్కి నెట్టి మరీ విజృంభిస్తారు. వెస్టిండీస్ దిగ్గజం ఆండ్రీ రసెల్ రెండో కోవకు చెందినవాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. అతడి బ్యాట్‌లోని మందుగుండు ఇంకా తగ్గలేదని అబుధాబి టీ10 లీగ్‌లో మరోసారి రుజువు చేశాడు.

నవంబర్ 13న యూఏఈ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరేబియన్ ఏసెస్ తరఫున ఆడిన రసెల్.. ఒక్కడే రెండు పాత్రలు పోషించాడు. సంక్షోభంలో ఆదుకున్న హీరోగా, ప్రత్యర్థిని కూల్చిన విలన్‌గా మారాడు.

29/6.. శిథిలాల నుంచి విధ్వంసానికి..!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అరేబియన్ ఏసెస్ ఒక్కసారిగా 29 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అభిమానులు టీవీలు కట్టేయాలనుకున్న సమయంలో రసెల్ క్రీజులోకి వచ్చాడు.

వచ్చీరావడంతోనే 6,6,6,6,4,4.. అంటూ బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. డ్వేన్ ప్రిటోరియస్‌తో కలిసి 24 బంతుల్లో 60 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 18 బంతుల్లో 46 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 10 ఓవర్లలో 92కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మ్యాచ్ రంగు మారిపోయింది.

బ్యాట్‌తోనే కాదు.. బంతితోనూ బాస్..!

92 పరుగులు టీ10లో పెద్ద స్కోరు కాదు. కానీ రసెల్ అదే ఊపును బౌలింగ్‌లోనూ కొనసాగించాడు. కేవలం 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అందులో మామూలు పేర్లు లేవు.. ఎనియూరిన్ డోనాల్డ్, ప్రత్యర్థి కెప్టెన్ కీరన్ పోలార్డ్, సునీల్ నరైన్. ముగ్గురు స్టార్లను పెవిలియన్‌కు పంపి యూఏఈ బుల్స్‌ను 10 ఓవర్లలో 84 పరుగులకే కట్టడి చేశాడు. 8 పరుగుల తేడాతో అరేబియన్ ఏసెస్ థ్రిల్లింగ్ విజయం సాధించింది.

రసెల్ జోరుకు బ్రేకే లేదు..!

ఈ సీజన్‌లో రసెల్ ఫామ్ మామూలుగా లేదు. ఇప్పటిదాకా 6 మ్యాచ్‌ల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో 41.66 సగటుతో 125 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 46. నవంబర్ 14న ఎమిరేట్స్ ఈగల్స్‌తో మ్యాచ్‌లో కూడా 225 స్ట్రైక్ రేట్‌తో 16 బంతుల్లో 36*తో అజేయంగా నిలిచాడు.

ముసలివాడయ్యాడని అనుకున్నారా? బ్యాట్ పట్టుకుంటే ఇప్పటికీ యువ బౌలర్లకు వణుకు పుడుతుందని రసెల్ మళ్లీ నిరూపించాడు. టీ10 అంటేనే రసెల్ షో..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us