శ్రీకాళహస్తి ఆలయంలో మరో కొత్త వివాదం

| Edited By: Pardhasaradhi Peri

Sep 13, 2020 | 2:10 PM

పిఠాపురం, అంతర్వేది ఆలయ ఘటనలు మరవకముందే...శ్రీకాళహస్తిలో మరో కొత్త వివాదం నెలకొంది. మూడు రోజుల క్రితం ముక్కంటి ఆలయంలో కొత్త ప్రతిమలు ప్రత్యక్షమయ్యాయి. అయితే ప్రాణప్రతిష్ట జరగని విగ్రహాలు ఆలయంలోకి రావడం అపచారమంటున్నారు ఆలయ అర్చకులు.

శ్రీకాళహస్తి ఆలయంలో మరో కొత్త వివాదం
Follow us on

పిఠాపురం, అంతర్వేది ఆలయ ఘటనలు మరవకముందే…శ్రీకాళహస్తిలో మరో కొత్త వివాదం నెలకొంది. మూడు రోజుల క్రితం ముక్కంటి ఆలయంలో కొత్త ప్రతిమలు ప్రత్యక్షమయ్యాయి. ఆలయంలోని పరివార దేవతల ప్రాతంలో కొత్తగా ఒక శివలింగంతో పాటు నందీశ్వరుడు విగ్రహం కనిపించడంతో ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. ప్రాణప్రతిష్ట జరగని విగ్రహాలు ఆలయంలోకి రావడం అపచారమంటున్నారు ఆలయ అర్చకులు. వెంటనే సంప్రోక్షణ నిర్వహించారు.

 

ఆలయం దగ్గర సెక్యూరిటీ పటిష్టంగా ఉంది. అయితే ఆలయం లోపలికి ఈ విగ్రహాలు ఎలా వచ్చాయి అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై ఇప్పటికే దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌రెడ్డి శ్రీకాళహస్తి వన్‌టౌన్‌ పోలీసులకూ ఫిర్యాదు చేశారు . అటు అంతర్గత విచారణకూ నలుగురు సభ్యులతో కమిటీని వేశారు.

మరోవైపు ఆలయ సెక్యూరిటీ టెండర్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ లను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అయితే మూడు రోజులు గడుస్తున్నా ఈ విగ్రహాలను లోపలికి తెచ్చిందెవరన్నది తేల్చకపోవడమే అనుమానాలను రేకెత్తిస్తోంది.

 

మరోవైపు రహస్యంగా ఆలయంలో విగ్రహాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ, జనసేన కార్యకర్తలు.. శ్రీకాళహస్తి ఆలయ పరిపాలనా భవనం దగ్గర ధర్నా నిర్వహించారు. ఎవరి కోసం పూజలు చేయడానికి వీటిని తెచ్చారంటూ నిలదీశారు. కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోసం ప్రత్యేక పూజలు చేసారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. దేవాలయంలో ఇన్ని సీసీ కెమెరాల ఉంటే ఇంతవరకు విగ్రహాలను లోపలికి తీసుకెళ్లిన ఫుటేజ్ ఎందుకు దాస్తున్నారంటూ ఈవో పై వాగ్వాదానికి దిగారు. విగ్రహాల వివాదం తేల్చకపోతే ఎలయంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.

ఈ వివాదంలో ఇప్పటికే కేసు పెట్టామన్న ఈవోచంద్రశేఖర్‌రెడ్డి, ఇద్దరు సిబ్బందినీ విధుల్లో నుంచి తప్పించామన్నారు. ఆలయంలోకి విగ్రహాలను ఎవరు తెచ్చినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.