సాక్షాత్తూ దుర్గాదేవి స్వరూపం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?

అయితే విజయదశమి పండుగ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముగింపు..ఈ రోజున రాజరాజేశ్వరి దేవికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారు విజయోత్సవంతో దర్శనమిస్తారు. విజయదశమి సాయంత్రం జమ్మి వృక్ష పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం సందర్భంగా జమ్మి చెట్టు వద్ద దుర్గాదేవిని ఆరాధించారు. అందుకే ఇది దుర్గాదేవి స్వరూపంగా భావిస్తారు.

సాక్షాత్తూ దుర్గాదేవి స్వరూపం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?
Jammi Tree Worship On Dasara

Updated on: Oct 19, 2026 | 8:33 PM

దసరా రోజున జమ్మి చెట్టు (శమీ వృక్షం) పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. జమ్మి ఆకులను బంగారంగా భావించి, ఒకరికొకరు ఇచ్చుకుంటూ విజయదశమి పండుగను జరుపుకుంటారు. పెద్దల చేతిలో జమ్మి ఆకులు పెట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు.. నవరాత్రి పూజలలో అత్యంత విశేషమైనదిగా భావించే శరన్నవరాత్రులు పాడ్యమి నుండి ప్రారంభమై దశమి వరకు జరుపుకుంటారు. హస్తా నక్షత్రంతో మొదలైన ఈ చంద్రకళా పూజలు శ్రవణా నక్షత్రంతో ముగుస్తాయి.. ఇదే విజయదశమి పండుగ రోజు. ఈ పవిత్ర దినాన రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవిగా అమ్మవారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. రాక్షస వధానంతరం దేవతలందరూ విజయదశమి నాడు అమ్మవారికి పట్టాభిషేకం చేసి అనేక స్తుతులతో మెప్పించారని పురాణాలు చెబుతున్నాయి.

నవమి రోజున కలశానికి ఉద్వాసన చెప్పాలి. దేవుడికి ఉద్వాసన చెప్పకూడదని, కలశం పెట్టుకున్నవారు కేవలం కలశ ఉద్వాసన మాత్రమే చేయాలని గుర్తుంచుకోవాలి. విజయదశమి నాడు రాజరాజేశ్వరి దేవికి పట్టాభిషేకం చేసిన తర్వాత విశేషమైన కుంకుమార్చనలు, పుష్పాలు, తులసి దళాలు, మారేడు దళాలతో పూజలు చేస్తారు.

జమ్మి వృక్ష పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత

విజయదశమి సాయంత్రం జమ్మి వృక్ష పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టి, దుర్గాదేవిని ఆరాధించారు. ఆ తర్వాతే ఉత్తర గోగ్రహణం, యుద్ధంలో విజయం సాధించారు. అందుకే జమ్మి చెట్టు దుర్గాదేవి స్వరూపంగా భావించబడుతుంది. జమ్మి పత్రాలతో శని గ్రహానికి పూజ చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని, అత్యంత కఠినమైన కష్టాలు ఉన్నప్పుడు జమ్మి చెట్టుకు పచ్చిపాలు పోసి, పసుపు కుంకుమ సమర్పించి, ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరి, కష్టాలు తీరుతాయని నమ్మకం.

జమ్మి ఆకులను బంగారంగా భావించి..

విజయాలను చేకూర్చే దశమి కాబట్టి, విజయదశమి నాడు జమ్మి చెట్టు వద్ద ధూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రదక్షిణలు చేస్తారు. జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దల చేతుల్లో పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం యుగయుగాలుగా వస్తున్న సాంప్రదాయం. ఈ తరాలవారు కూడా జమ్మి చెట్టు ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని పఠించాలి. దుర్గా సూక్తం లేదా లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి.

వృక్షో రక్షతి రక్షితః..

ఈ పూజలన్నీ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో మమేకం అవ్వాలనే సందేశాన్ని ఇస్తాయి. మనం చెట్లను నరకకుండా, వాటిని పూజించాలని, వృక్షో రక్షతి రక్షితః అనే సూత్రాన్ని పాటించాలని ఈ పండుగ గుర్తు చేస్తుంది. ఎటువంటి అమంగళాలు జరగకుండా ఉండటానికి, మంగళాలు కలగడానికి జమ్మి వృక్షానికి ఐదు శ్లోకాలు చెప్పబడినప్పటికీ, శమీ శమయతే పాపం అనే శ్లోకం చాలా ప్రసిద్ధి చెందింది. మరొక శ్లోకం అమంగళానాం ప్రసమీం దుక్షతస్య చ నాశినీం దుస్వప్న హరిణీం ధన్యాం ప్రపద్యే హం ప్రియాం శమీం ఎటువంటి దుష్ట స్వప్నాలను, అశుభాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తుందని తెలియజేస్తుంది. నమో విశ్వాస వృక్షాయ పార్ధ సశ్రాసధారినే తత్వతః పత్రం ప్రతీక్షామి సదామే విజయీభవ అనే శ్లోకం జమ్మి ఆకులు మనల్ని ఎప్పుడూ రక్షిస్తాయని చెబుతుంది.

మీ ఇంటి దగ్గర లేదా కాలనీ పార్కులలో జమ్మి వృక్షాన్ని పెంచి, ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ ప్రాంతానికి కూడా రక్షణ లభిస్తుందని నమ్మకం. ప్రకృతితో మమేకమై జమ్మి చెట్టు అనుగ్రహాన్ని పొంది, విజయదశమిని సంతోషంగా జరుపుకోండి..

Loading...
Unable to load recommendations.
Follow Us