కోటి మంది పిల్లలకు ఆరోగ్య భాగ్యం.. సత్యసాయి గ్రామంలో ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు

Sri Sathya Sai Annapoorna Trust: పాఠశాల విద్యార్థుల్లో ఆకలి తీర్చి, వారికి చక్కని పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం ఆంధ్రా-కర్నాటక సరిహద్దు ప్రాంతమైన ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో ఘనంగా జరిగింది.

కోటి మంది పిల్లలకు ఆరోగ్య భాగ్యం.. సత్యసాయి గ్రామంలో ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు
Sri Sathya Sai Annapoorna Trust 10th Anniversary

Updated on: Feb 14, 2026 | 4:35 PM

బడి పిల్లల్లో ఆకలి తీర్చి, వారికి చక్కని పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం ఆంధ్రా-కర్నాటక సరిహద్దు ప్రాంతమైన ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో ఘనంగా జరిగింది. రోజూ కేవలం 50 మంది చిన్నారులకు అల్పాహారాన్ని అందించడం ద్వారా ప్రారంభమైన ఈ సేవలు ప్రస్తుతం రోజూ కోటి మందికిపైగా బడి పిల్లలకు సాయి ష్యూర్ మల్ట్రీ న్యూట్రిషియన్ డ్రింక్ ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని కల్పిస్తోంది. ఈ సేవలు దేశంలో 25 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 1.5 లక్షల పాఠశాలలకు విస్తరించాయి. దశమ వార్షికోత్స వేడుకల్లో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయితోపాటు ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాల్ న్యూట్రీషియన్ ఎరాడికేషన్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ దీపక్ ఆర్ సావంత్ పాల్గొన్నారు. పదేళ్లలో అన్నపూర్ణ ట్రస్ట్ చేసిన సేవల్ని ఆయన కొనియాడారు.

పిల్లల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే నిరంతర ప్రయత్నం, పరస్పర సహకారం చాలా అవసరమని అన్నారు. ‘ఈ రోజు ఈ పిల్లల కోసం మనం చేస్తున్న సేవా ఫలితాలు 20 సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి. వారు ఆరోగ్యవంతమైన భారత పౌరులుగా ఎదిగినప్పుడు ఆ ఫలితం స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ అన్నపూర్ణ ట్రస్ట్ వంటి ఆధ్యాత్మిక సంస్థతో చేతులు కలిపితే సేవా కార్యక్రమాల విస్తృతి పెరుగుతుంది అని ఆయన అన్నారు.

మహారాష్ట్రలో విస్తరణ..

త్వరలోనే తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న విధంగానే మహారాష్ట్రలో కూడా అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సాయి ష్యూర్ అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయమై రెండు మూడు నెలల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకునేలా ప్రయత్నిస్తాని స్పష్టం చేశారు. అనంతరం వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు, శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ మార్గదర్శకులు సద్గురు మధుసూదన్ సాయి మాట్లాడుతూ.. పోషకాహారం పొందిన ప్రతి బాలుడూ దేశానికి లభించే అత్యంత విలువైన ఆస్తి అని అన్నారు.

పదేళ్లలో అన్నపూర్ణ ట్రస్ట్ అద్భుత ప్రయాణం

అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా మహారాష్ట్రలో బడి పిల్లలకు సేవలందించేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన మహారాష్ట్ర మాల్ న్యూట్రీషియన్ ఎరాడికేషన్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ దీపక్ ఆర్ సావంత్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఫలితంగా అక్కడ పిల్లలు ఆరోగ్యవంతులుగా, ఆనందంగా ఎదిగి మంచి పౌరులుగా మారగలరు అని అన్నారు. గడిచిన పదేళ్లలో అన్నపూర్ణ ట్రస్ట్ అద్భుత ప్రయాణాన్ని ప్రస్తావించిన సద్గురు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అలాగే ‘‘వసుధైవ కుటుంబకం” అనే భావనను ప్రస్తావిస్తూ, మనం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూసినప్పుడు ఏ పిల్లాడు ‘అన్యుడు’ కాదని, వారి ఆకలి మన బాధ్యతగానే భావించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కార్యదర్శులు, ఐఏఎస్ అధికారులు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా తమ తమ రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు అందిస్తున్న సేవలపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సేవలు దేశ వ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ అందాలని ఆకాక్షించారు. వీరితో పాటు ఈ వేడుకల్లో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సేవల ద్వారా స్ఫూర్తి పొంది దేశ వ్యాప్తంగా స్వచ్ఛందంగా సేవలందిస్తున్న 600 మందికిపైగా వాలంటీర్లు కూడా పాల్గొన్నారు.

సాయి ష్యూర్‌లో..

– రాగి పిండి
– ఉప్పు
– దాల్చిన చెక్క
– వరి పిండి
– పసుపు
– మినరల్ ప్రీ మిక్స్
– విటమిన్ ప్రీ మిక్స్ ఉంటాయి.

ఇక సాయి ష్యూర్ ప్రత్యేకత విషయానికి వస్తే…

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది
సంపూర్ణ ఆరోగ్యం
పిల్లల్లో ఎముకల బలాన్ని పెంచుతుంది
జింక్, బీ 12 విటమిన్లను సరిపడా అందిస్తుంది
RDA సిఫారసు చేసిన మైక్రో న్యూట్రియంట్స్‌లో 50 శాతం అందిస్తుంది
పిల్లలకు ఇది పూర్తిగా ఉచితం
ప్రభుత్వం అందించే పాలు లేదా బెల్లంతో కలిపి ఇస్తారు
పూర్తి పోషకాహారంతో కూడిన ఈ మిశ్రమాన్ని దేశంలో ఎక్కడికైనా సరఫరా చెయ్యడం సులభం.