
“అష్టసిద్ధి నవ నిధి కే దాతా.. అసబర్ దీన్ జానకీ మాతా” – సీతామ్మ హనుమంతుడికి అష్టసిద్ధులను ప్రసాదించిందని హనుమాన్ చాలీసా చెబుతోంది. ఈ సిద్ధులు పొందిన వ్యక్తికి ప్రపంచంలో అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. మరి ఆ ఎనిమిది శక్తులు ఏవి? హనుమంతుడు వాటిని ఎక్కడెక్కడ ఉపయోగించాడు? సామాన్య భక్తులకు ఈ సిద్ధుల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు సవివరంగా విశ్లేషిద్దాం..
ఆ ‘ఎనిమిది’ మహా శక్తుల వివరణ ఇది.. :
అణిమ: శరీరాన్ని పరమాణువు అంత సూక్ష్మ రూపంలోకి మార్చుకోవడం. సురస నోటిలోకి వెళ్లేటప్పుడు స్వామి ఈ శక్తిని వాడారు.
మహిమ: శరీరాన్ని పర్వతం అంత భారీ రూపంలోకి విస్తరించడం. సముద్రాన్ని దాటేటప్పుడు, లంకలో యుద్ధ సమయంలో దీనిని ఉపయోగించారు.
గరిమ: శరీరాన్ని ఊహించలేనంత బరువుగా మార్చుకోవడం. భీముడి గర్వాన్ని అణచేందుకు తోకను కదపలేనంత బరువుగా మార్చింది ఈ శక్తితోనే.
లఘిమ: శరీరాన్ని గాలి కంటే తేలికగా మార్చుకుని ఆకాశంలో ప్రయాణించడం.
ప్రాప్తి: ఎక్కడికైనా వెళ్లగలగడం, ఏ వస్తువునైనా పొందగలగడం. జంతువుల భాషను కూడా అర్థం చేసుకునే శక్తి దీనివల్ల వస్తుంది.
ప్రాకామ్యం: మనసులో అనుకున్నది వెంటనే జరిగేలా చేయడం. భూమి లోపలికి వెళ్లడం లేదా నీటిపై నడవటం దీనివల్ల సాధ్యం.
ఈశత్వం: ప్రకృతి శక్తులను, పంచభూతాలను తన నియంత్రణలో ఉంచుకోవడం. దైవ సమానమైన అధికారం.
వశిత్వం: ఎవరినైనా, దేనినైనా తన వశం చేసుకోవడం. ఇంద్రియాలను జయించడం.
భక్తులకు సందేశం:
ఈ సిద్ధులు కేవలం అద్భుతాలు చేయడానికి మాత్రమే కాదు.. క్రమశిక్షణ, బ్రహ్మచర్యం మరియు అంకితభావంతో ఉంటే మనిషి అసాధ్యాలను సుసాధ్యం చేయగలడనే దానికి హనుమంతుడు ఒక నిదర్శనం.
హనుమాన్ జయంతి రోజున ‘సుందరకాండ’ పఠించడం వల్ల మానసిక భయాలు తొలగి అష్టసిద్ధుల వంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఎలాంటి సందేహాలున్న పండితులను జ్యోతిష్యనిపుణుల సలహా తీసుకోవడం మంచిది.