
Bugga Malleshwara Temple Story: హిందూ ధర్మంలో పరమశివుడిని గంగాధరుడిగా ఆరాధిస్తారు. గంగాదేవి ఆయన జటాజూటంలో కొలువై ఉంటుందని పురాణాలు చెబుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ అరుదైన శైవ క్షేత్రంలో మాత్రం శివలింగం పక్కనే గంగమ్మ నీటి బుగ్గ రూపంలో దర్శనమిస్తుంది. అంతేకాదు! ఒకవైపు భ్రమరాంబ సమేత మల్లేశ్వరుడు, మరోవైపు సీతారాములు కొలువైన ఈ ఆలయం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ఒడిలో, అడవి మధ్యలో వెలసిన ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచవరం మండల పరిధిలో, మోర్జంపాడు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో, ఎత్తైన రాళ్ల గుట్టల మధ్య ఈ క్షేత్రం ప్రకృతి అందాల నడుమ కొలువై ఉంది. ఈ ఆలయానికి బుగ్గ మల్లేశ్వరుడు అనే పేరు రావడానికి ప్రత్యేక కారణం ఉంది. సాధారణంగా శివాలయాల్లో అభిషేకానికి నీటిని బయట నుంచి తీసుకొస్తారు. కానీ ఇక్కడ గర్భాలయంలో శివలింగం పక్కనే చిన్న నీటి బుగ్గ ఉంటుంది. చుట్టుపక్కల నీటి వనరులు పెద్దగా కనిపించని ప్రాంతంలోనూ ఈ బుగ్గలో నీరు నిరంతరం ఊరుతుండటం విశేషం. ఈ నీటితోనే స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు.
ఈ క్షేత్రంలో బుగ్గ మల్లేశ్వరుడు భ్రమరాంబ అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. గర్భగుడిలో స్వామివారి పక్కనే భద్రకాళి, వీరభద్ర స్వామి కూడా కొలువై ఉన్నారు. ఆలయానికి ఎదురుగా వృద్ధ లింగేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. బుగ్గ మల్లేశ్వరుని ఆలయం కంటే ఈ శివలింగం ముందుగా ప్రతిష్ఠితమైందని స్థానికంగా చెబుతారు. ఆలయానికి దక్షిణ దిశలో సీతారాముల ఆలయం ఉంది. ఎదురుగా ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటున్నాడు. ఆగ్నేయ దిశలో నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది. ఇక్కడ నాగదేవతను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో రెండు పవిత్ర కోనేరులు ఉన్నాయి.
సుమారు 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని చరిత్ర చెబుతోంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం అమరావతి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఆలయాన్ని, నీటి బుగ్గను చూసి ఆశ్చర్యపోయారట. అనంతరం స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు జరిగేలా ఏర్పాట్లు చేయించారని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.
ఈ ఆలయంలో అనాదిగా వారంలో ఒక్క సోమవారం మాత్రమే పూజలు నిర్వహించడం ప్రత్యేకత. కార్తీక మాసం, మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ ప్రాంతం తపస్సుకు అనువైన పవిత్ర భూమి అని రామానంద సరస్వతి స్వామివారు పేర్కొన్నట్లు చెబుతారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి మోర్జంపాడు మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయాన్ని సందర్శించవచ్చు. ప్రకృతి ఒడిలో కొలువైన ఈ అరుదైన హరిహర క్షేత్రాన్ని దర్శించుకోవడానికి శివభక్తులు ఆసక్తి చూపుతారు.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఆలయ చరిత్ర, స్థలపురాణం, ఆధ్యాత్మిక విశేషాలు స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని ఆధ్యాత్మిక, సంప్రదాయ విశ్వాసాలుగా మాత్రమే పరిగణించాలి.)
మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.