మళ్ళీ తెరమీదికి ప్రత్యేక హోదా.. ఈసారి బాబు ప్లాన్ ఏంటంటే?

|

Dec 14, 2019 | 1:22 PM

గత అయిదేళ్ళుగా తరచూ వినిపిస్తున్న నినాదం ఏపీకి ప్రత్యేక హోదా అంశం. పొలిటికల్‌గా స్టాగ్నేషన్ వచ్చిన ప్రతీసారి ఏదో ఒక రాజకీయ పార్టీ ఏపీకి ప్రత్యేక కేటగిరి స్టేటస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేసి.. కొన్ని రోజులు హడావిడి చేయడం చూస్తూనే వున్నాం. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం ఆధారంగా ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదికి తెచ్చే […]

మళ్ళీ తెరమీదికి ప్రత్యేక హోదా.. ఈసారి బాబు ప్లాన్ ఏంటంటే?
Follow us on

గత అయిదేళ్ళుగా తరచూ వినిపిస్తున్న నినాదం ఏపీకి ప్రత్యేక హోదా అంశం. పొలిటికల్‌గా స్టాగ్నేషన్ వచ్చిన ప్రతీసారి ఏదో ఒక రాజకీయ పార్టీ ఏపీకి ప్రత్యేక కేటగిరి స్టేటస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేసి.. కొన్ని రోజులు హడావిడి చేయడం చూస్తూనే వున్నాం. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం ఆధారంగా ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదికి తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి తొలుత అయిదేళ్ళ పాటు.. ఆ తర్వాత పదేళ్ళ పాటు ప్రత్యేక కేటగిరీ స్టేట్ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలో ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పక్కన పెట్టేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. దానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీకి ప్రత్యేక హోదా అనుకూలాంశంగా మారే పరిస్థితి కనిపించడంతో టీడీపీ అధినేత మరోసారి నింద మోదీపైన వేస్తూ.. ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి భుజానికెత్తుకున్నారు.

2019 మే నాటి ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశంపై మూడు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీలు ఎవరి వాదన అవి వినిపించాయి. ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశం దాదాపు తెరమరుగైనట్లే భావిస్తున్న తరుణంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మారోసారి ప్రత్యేక హోదా అంశంపై గళమెత్తారు. ప్రత్యేక హోదాను వైసీపీ పక్కన పెట్టిందని, ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోను వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలు లేవనెత్తలేదని అన్నారు రవీంద్ర కుమార్. జగన్ తమ 24 మంది ఎంపీలను ప్రధాని మోదీ వద్దకు పంపి, ప్రత్యేక హోదా సహా విభజన హామీలను సాధించాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.

పార్లమెంటు సెషన్ ముగిసే వరకు ఆగి.. ఉన్నట్లుండి టీడీపీ నేతలు ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదికి తేవడం చంద్రబాబు వ్యూహంలో భాగమేనని చెప్పుకుంటున్నారు. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని.. తమ హయాంలో వచ్చిన నిధులను, ఇప్పుడు జగన్ హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని కంపేర్ చేసి చూపడం ద్వారా ప్రజల్లోకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకువెళ్ళాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. ఈసారి చంద్రబాబుకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో వేచి చూడాలి.