దేశ వ్యాప్తంగా శీతాకాలం దాదాపుగా వచ్చేసింది. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు చల్లని చలిగాలులు ఉన్నాయి. దీంతో ఫుల్ స్లీవ్స్ బట్టలు, వెచ్చదనం ఇచ్చే స్వెటర్లు, జాకెట్లు బీరువాల నుంచి బయటకు రావడం ప్రారంభించాయి. అయితే శీతాకాలం వచ్చిందంటే.. కొన్ని ప్రాంతాలు మంచుతో నిండి సరికొత్త అందాలను సంతరించుకుంటాయి. చలికాలంలో తెల్లటి మంచును చూస్తూ.. ప్రకృతి అందాలను అనుభవించడం అదొక మధురానుభూతి. అందుకనే శీతాకాలంలో స్కీయింగ్‌కు వెళ్లడానికి చాలామంది అమితాశక్తిని చూపిస్తారు. భారతదేశంలో పర్వత శిఖరాలపై శీతాకాలపు థ్రిల్‌లను ఆస్వాదించడానికి అత్యంత ఉత్తమమైన ప్రదేశాలున్నాయి. చలికాలంలో భారతదేశంలో స్కీయింగ్ చేయడానికి కొన్ని ఉత్తమమైన ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం..
ఔలి: మన దేశంలో శీతాకాలపు క్రీడల గమ్యస్థానంగా ఔలీ నిలుస్తుంది. ఇది దేశంలోని అత్యుత్తమ స్కీయింగ్ ప్రాంతాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఈ అందమైన ప్రాంతం ఉత్తరాఖండ్ ఒడిలో ఉంది. అత్యంత ఇష్టపడే స్కీయింగ్ హబ్.. నగర జీవితానికి ఆధునిక హంగులకు సందడికి దూరంగా ఉండి.. సహజమైన అందంతో అందరిని ఆకర్షిస్తుంది.
గుల్మార్గ్: అత్యుత్తమ స్కీయింగ్ ప్రాంతాల్లో ఒకటి గుల్మార్గ్. సుందరమైన భౌగోళిక ప్రదేశం భూలోక స్వర్గం. గుల్మార్గ్ మంచు పర్వతాలు, పచ్చిక బయళ్లు, ఉద్యానవనాలు, సరస్సులు వంటి సహజ సుందర దృశ్యాలతో ఆకర్షించే అద్భుత ప్రదేశం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ గోండోలా లేదా కేబుల్ కార్, ఇది ఆసియాలో అతిపెద్ద కేబుల్ కార్ ప్రాజెక్ట్, ఇందులో రెండు ప్రధాన స్టాప్‌లు ఒకటి కొంగ్డోరి వద్ద, మరొకటి అప్పర్వాత్ శిఖరం వద్ద ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందాలను ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. చూసేందుకు ఈ సీజనే సరైన సమయం
సోలాంగ్ వ్యాలీ: మనాలి నుండి 14 కి.మీ దూరంలో ఉన్న సోలాంగ్ నాలా హిమాచల్ ప్రదేశ్‌లో స్కీయింగ్‌కు వెళ్లడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి-మీరు మొదటి సారి మాత్రమే వెళ్లేవారు మాత్రమే కాదు క్రీడలో ప్రావీణ్యం సంపాదించిన వారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. స్నో ట్రెక్కింగ్, స్నోబోర్డింగ్ వంటివి పర్యాటకులను ఆకర్షిస్తాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ అనేక స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను కూడా అందిస్తుంది.
కుఫ్రి: హిమాచల్ ప్రదేశ్‌లో అద్భుతమైన స్కీయింగ్ ప్లేస్.. కుఫ్రి. శీతాకాలంలో ఈ అత్యంత ఆకర్షణీయమైన ప్లేస్ కు ప్రపంచం నలుమూలల నుండి స్కీయర్ల వస్తారు. మంచు పొరలతో కప్పబడిన సున్నితమైన వాలులు అద్భుతమైన స్కీయింగ్ అనుభవాన్ని అందిస్తాయి.
నరకంద: హిమాచల్ ప్రదేశ్ లో మరో గొప్ప స్కీయింగ్ ప్లేస్ నరకంద. సిమ్లా నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరకంద మనదేశంలో స్కీయింగ్‌ను ఆస్వాదించడానికి మరొక అద్భుతమైన ప్రదేశం.
తవాంగ్: ఉత్తేజపరిచే స్కీయింగ్ అనుభవం కావాలంటే తవాంగ్ నగరం బెస్ట్ ప్లేస్. ఇక్కడ స్కీయింగ్ చేయడానికి ఉత్తమమైన ప్రదేశం పంగా టెంగ్ త్సో సరస్సు. అనుభవజ్ఞులైన స్కీయర్‌లకు స్వర్గధామం ఈ ప్రదేశం. అరుణాచల్ ప్రదేశ్‌లోని బౌద్ధులలో మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది-ఇది ఉత్తమమైన థ్రిల్, సంస్కృతిని కలిపి పర్యాటకులకు సంతోషాన్ని ఇస్తుంది.