
పోషకాల గని: ఒక అరటిపండును కేవలం చిరుతిండిగా చూడకూడదు. ఇది పోషకాల పవర్‌హౌస్. ఒక సాధారణ పరిమాణంలో ఉండే అరటిపండు సుమారు 105 కేలరీల శక్తిని అందిస్తుంది. ఇందులో 1.29 గ్రాముల ప్రోటీన్, 3.07 గ్రాముల ఫైబర్ ఉండటంతో పాటు విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే 88.4 గ్రాముల నీటి శాతం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. కొవ్వు శాతం దాదాపు శూన్యం కావడంతో బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

జీర్ణవ్యవస్థకు ప్రాణవాయువు: అరటిపండు జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే రెసిస్టెన్స్ స్టార్చ్, ప్రీబయోటిక్ ఫైబర్ పేగులలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. పచ్చి అరటిపండ్లలో ఉండే యాంటీ అల్సర్ గుణాలు కడుపులో గ్యాస్ సమస్యలను తగ్గించడమే కాకుండా కడుపు లోపలి పొరను రక్షిస్తాయి. తద్వారా అల్సర్లు, మలబద్ధకం వంటి సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

రక్తపోటు నియంత్రణలో మేటి: ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవితంలో రక్తపోటు అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అరటిపండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని అదనపు సోడియం ప్రభావాన్ని తగ్గించి, రక్తనాళాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజూ ఒక అరటిపండు తింటే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా స్ట్రోక్ వంటి ప్రమాదాలు దరిచేరకుండా ఉంటాయి.

తక్షణ శక్తి - ఒత్తిడి నివారణ: పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసిన తర్వాత నీరసంగా అనిపిస్తే.. అరటిపండు ఒక ఇన్స్టంట్ ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలు తక్షణ శక్తినిస్తాయి. అంతేకాకుండా దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. అందుకే భోజనాల మధ్యలో ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ తినే బదులు అరటిపండు తినడం ఉత్తమమైన ఎంపిక.

ఖరీదైన మందులు, విదేశీ పండ్ల కంటే మనకు అందుబాటులో ఉన్న అరటిపండు ఎంతో మేలైనది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక అరటిపండును మీ ఆహారంలో భాగం చేసుకుంటే.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు దీనిని తీసుకోవడం మంచిది.