
ఆహార సంబంధిత అలెర్జీలలో పీనట్ అలెర్జీ అత్యంత సాధారణమైనది, ప్రమాదకరమైనది. పల్లీలు పడని వ్యక్తులు పొరపాటున వీటిని తిన్నా లేదా వీటితో చేసిన పదార్థాలు తీసుకున్నా తీవ్రమైన ప్రతిచర్యలు కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడం, తీవ్రమైన దురద, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో గొంతు వాచిపోయి శ్వాస తీసుకోవడం కష్టమయ్యే అనాఫిలాక్సిస్ అనే ప్రాణాంతక పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకే అలెర్జీ ఉన్నవారు వేరుశనగలకు, పీనట్ బటర్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

బరువు తగ్గాలని కఠినమైన డైట్ ఫాలో అయ్యేవారు పల్లీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పల్లీలలో ప్రొటీన్లు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, వీటిలో కేలరీలు, కొవ్వు పదార్థాలు కూడా చాలా అధిక మోతాదులో ఉంటాయి. స్నాక్స్‌గా వీటిని గుప్పెళ్లకు గుప్పెళ్లు లాగించేస్తే శరీరంలో కేలరీల లెక్క అమాంతం పెరిగిపోతుంది. దీనివల్ల బరువు తగ్గకపోగా.. వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఊబకాయం సమస్య ఉన్నవారు వీటిని వైద్యుల సలహాతో చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి.

సాధారణంగా పచ్చి పల్లీలలో సోడియం శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే మనం టైమ్‌పాస్ కోసం రోడ్డు పక్కన లేదా మార్కెట్‌లో కొనుగోలు చేసే వేరుశనగలు ఎక్కువగా ఉప్పు వేసి వేయించినవి ఉంటాయి. ఈ అధిక ఉప్పు శరీరంలోకి చేరడం వల్ల బీపీ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి, హైబీపీ పేషెంట్లకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉప్పు కలిపిన పల్లీలను గుండె జబ్బులు ఉన్నవారు పూర్తిగా దూరం పెట్టడమే శ్రేయస్కరం.

పల్లీలలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రెండు కొవ్వు ఆమ్లాల మధ్య శరీరంలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అంతర్గతంగా వాపు పెరుగుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆ బాధ మరింత తీవ్రమవుతుంది. శరీరంలో వాపు సంబంధిత సమస్యలు ఉన్నవారు పల్లీలను అతిగా తింటే నొప్పులు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

చివరగా పల్లీలలో ఫైటిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో ఒక యాంటీ న్యూట్రియంట్‌గా పనిచేస్తుంది. మనం తీసుకున్న ఆహారంలోని జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి కీలకమైన ఖనిజాలను శరీరం గ్రహించకుండా ఈ ఫైటిక్ యాసిడ్ అడ్డుకుంటుంది. దీనివల్ల శరీరంలో రక్తహీనత, ఎముకల బలహీనత వంటి పోషకాహార లోపాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పల్లీలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. మీ శరీర తత్వాన్ని, అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి అసలైన శ్రీరామరక్ష. (గమనిక: ఈ వివరాలు కేవలం సాధారణ అవగాహనకోసం మాత్రమే అందించినవి. ఏమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తమ ఆహారంలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిది.)