
రోజువారీ బిజీ షెడ్యూల్‌లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం పిల్లల కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్‌ను త్వరగా తయారుచేయడం సవాలుగా అనిపించవచ్చు. అలాంటి సమయాల్లో గోధుమపిండి, గుడ్డుతో చేసే ఈ రెసిపీ మీకు ఉత్తమమైన పరిష్కారం. ఇది చాలా సులభం, పోషకమైనది. చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు.. గోధుమపిండి 1 కప్పు, మైదాపిండి 1 స్పూన్ (ఐచ్ఛికం), ఉప్పు రుచికి సరిపడినంత, నీరు పిండి కలపడానికి తగినంత (సుమారు 1 1/2 నుండి 2 కప్పులు), గుడ్డు 1 (లేదా గుడ్డుకు బదులుగా చిన్న గ్లాసు పాలు), నూనె పాన్ కేక్ చేయడానికి కొద్దిగా, టమాటా కెచప్ రుచికి సరిపడినంత తీసుకోవాలి. అలాగే స్టఫింగ్ కోసం.. కీరదోస సన్నగా తరిగినవి, ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా తరిగినవి, ఉప్పు రుచికి సరిపడినంత, కారం రుచికి సరిపడినంత, ఆరెగానో పావు స్పూన్ (ఐచ్ఛికం) తీసుకోవాలి.

ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమపిండి వేయాలి. దీనికి ఒక స్పూన్ మైదాపిండిని కూడా జోడించుకోవచ్చు. ఒకవేళ మైదాపిండి వాడటం ఇష్టం లేకపోతే, పూర్తిగా గోధుమపిండితోనే చేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు వేసి, విస్కర్ లేదా స్పూన్‌తో బాగా కలపాలి, తద్వారా పిండి, ఉప్పు చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలపాలి. ఉండలు లేకుండా చూసుకోండి. పిండి మరీ పల్చగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు, దోశ బ్యాటర్ కంటే కొంచెం పల్చగా ఉండాలి. నిదానంగా నీళ్లు కలుపుతూ, సుమారు కప్పున్నర నుండి రెండు కప్పుల నీళ్లు పట్టవచ్చు. పిండి చక్కగా కలిసిన తర్వాత, దానిపై మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇది పిండి చక్కగా నానడానికి సహాయపడుతుంది.

పది నిమిషాల తర్వాత, నానిన పిండిలో ఒక గుడ్డు పగలగొట్టి వేయాలి. గుడ్డును పిండిలో పూర్తిగా కలిసే వరకు విస్కర్ తో బాగా కలపాలి. ఒకవేళ మీ ఇంట్లో గుడ్డు తినని వారు ఉంటే, గుడ్డుకు బదులుగా ఒక చిన్న గ్లాసు పాలను పిండిలో కలుపుకోవచ్చు. పాలు వేయడం వల్ల కూడా రుచి కమ్మగా ఉంటుంది. బ్యాటర్ ఇప్పుడు దోశ బ్యాటర్ కంటే కాస్త పల్చగా ఉండాలి. స్టఫింగ్ కోసం మరొక బౌల్ తీసుకుని, అందులో సన్నగా తరిగిన కీరదోస ముక్కలు, పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసి, పావు స్పూన్ ఆరెగానో (ఇది లేకపోతే స్కిప్ చేయవచ్చు) వేసి బాగా కలపాలి. ఈ స్టఫింగ్ ను పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, అది వేడయ్యాక ఒక చిటికెడు లేదా రెండు చిటికెడుల నూనె వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ను ఒక గరిటెడు తీసుకుని, పాన్ పై వేసి మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా వేసుకోవాలి.

ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి. కాలిన వైపు ఒక స్పూన్ టమాటా కెచప్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. దీనిపై మనం సిద్ధం చేసుకున్న స్టఫింగ్ ను కొద్దిగా పెట్టి, క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పాన్ కేక్‌లను తయారుచేసుకోవాలి. ఈ రెసిపీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు లేదా సాయంత్రం స్నాక్‌కు చాలా రుచికరంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ సమయంలో సిద్ధం అవుతుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది.