
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌లో వెతికి సమాధానం తెలుసుకుంటున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మొబైల్ ఫోన్లలో వివిధ విషయాలను శోధిస్తున్నారు. అయితే, భారతీయ పురుషులు రాత్రిపూట తమ ఫోన్లలో ఎక్కువగా దేని కోసం వెతుకుతారు? మహిళలు ఎక్కువగా ఎలాంటి విషయాలపై ఆసక్తి చూపిస్తారు? అనే అంశాలపై ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లు సమాచారం.

సంభాషణ ఆధారిత మీడియా ప్లాట్‌ఫామ్ 'బాబుల్ ఏఐ' సుమారు 8.5 కోట్ల మంది పురుషుల శోధన అలవాట్లను పరిశీలించినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం, భారతీయ పురుషులు మొబైల్ ఫోన్లలో గేమింగ్‌కు సంబంధించిన యాప్‌లు, కంటెంట్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

పురుషులు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. మార్కెట్‌లో షేర్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు తగ్గుతున్నాయి? పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటున్నాయి? వంటి విషయాలను తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది.

క్రీడలకు సంబంధించిన సమాచారం కూడా పురుషుల శోధనల్లో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రికెట్ వంటి క్రీడల్లో మ్యాచ్ స్కోరు ఎంత ఉంది? ఎవరు గెలిచారు? మ్యాచ్‌లో ఏం జరిగింది? వంటి వివరాలను తెలుసుకునేందుకు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. లైవ్ స్కోర్లు, మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన వంటి అంశాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదే సమయంలో మహిళల శోధన అలవాట్లు కొంత భిన్నంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మహిళలు ఆహార పదార్థాలు, వంటకాలు, దుస్తులు, ఫ్యాషన్‌కు సంబంధించిన విషయాలను ఎక్కువగా వెతుకుతున్నట్లు తెలిపింది. కొత్త వంటకాల తయారీ విధానాలు, దుస్తుల ఎంపిక, ఫ్యాషన్ ట్రెండ్స్ వంటి అంశాలపై ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే, సందేశాలు పంపుకోవడానికి మెసేజింగ్ యాప్‌లను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.