
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎంత తాపం నుంచి ఉపశమనం కలిగించడంలో పుచ్చకాయకు సాటి వేరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే చాలా మంది వేసవిలో పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. కానీ మనందరం పుచ్చకాయ తిని దాని తొక్కను పారేస్తుంటాం. కానీ మీకు తెలుసా వృద్ధాగా పడేసే పుచ్చ తొక్కతో రుచికరమైన దోసెలు తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

పుచ్చకాయ తొక్కతో దోసె తయారు చేయడానికి కావలసినవి.. పుచ్చకాయ తొక్క నుంచి చివరి ఆకుపచ్చ పొరను తీసివేసి మధ్యలో ఉన్న తెల్లటి పొరను తీసుకోవాలి. నానబెట్టిన బియ్యం ( బియ్యాన్ని సుమారు రెండు గంటలు నానబెట్టుకోవాలి), పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి పొడి, ఒక కప్పు నల్ల మినపప్పు తీసుకోవాలి.

ముందుగా పుచ్చకాయ తొక్కను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పుచ్చకాయ తొక్క, నానబెట్టిన బియ్యం, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ పాత్రలోకి తీసుకుని అందులో దోసె మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిని రాత్రంతా వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా పులిసి, దోసె క్రిస్పీగా ఉంటుంది.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై దోసె పాన్ వేడి చేయాలి. పాన్ కు నెయ్యి లేదా నూనె రాసి దోసె వేసుకోవాలి. ఇప్పుడు బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన పుచ్చకాయ తొక్క దోసె సిద్ధమైనట్లే మరి.

ఈ దోశను కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ దోశ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు కనీసం ఒక్కసారైనా పుచ్చకాయ తొక్క దోశను ప్రయత్నించడం మర్చిపోకూడదు.