
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. సోయా చాప్స్ (ప్లాంట్ బేస్డ్ మటన్ స్టైల్ చంక్స్): 1 కిలోగ్రాము, నూనె, బిర్యానీ ఆకు, దాల్చిని: 1.5 అంగుళాల ముక్క, స్టార్ అనైజ్ , లవంగాలు, పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సాల్ట్: 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ధనియాలపొడి, కారం పొడి, మటన్ గరం మసాలా, వేడి నీరు, మిరియాలపొడి..మసాలా పేస్ట్ కోసం: ఎండుకొబ్బరి చిప్ప, గసగసాలు: 2 టేబుల్ స్పూన్లు.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా ఎండుకొబ్బరి, గసగసాలను డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత, వాటిని మెత్తటి పేస్ట్‌గా చేసుకోవాలి. గసగసాలు ఎక్కువగా ఉండటం వల్ల మంచి రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోయాలి . నూనె వేడెక్కిన తర్వాత, బిర్యానీ ఆకు, దాల్చిని, స్టార్ అనైజ్, లవంగాలను వేసి వేయించాలి. సుగంధ ద్రవ్యాలు వేగిన తర్వాత, తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయల చీలికలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేవరకు వేపుకోవాలి.

ఉల్లిపాయలు వేగిన తర్వాత, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి, పచ్చివాసన పోయేవరకు బాగా వేపుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు పుదీనాను చేర్చి, బాగా కలపాలి. ఆ తర్వాత, ధనియాలపొడి, కారప్పొడి, మటన్ గరం మసాలా వేసి, సుమారు ఒక నిమిషం పాటు వేయించాలి. మసాలాలు వేగిన తర్వాత, సిద్ధంగా ఉంచుకున్న ఒక కిలోగ్రాము సోయా చాప్స్‌ను వేయాలి. ఈ సోయా చాప్స్‌ను మసాలా మిశ్రమంలో దాదాపు ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. దీని వలన కర్రీ రుచి అదిరిపోతుంది.

ఇప్పుడు సోయా చాప్స్ మసాలాలో బాగా వేగిన తర్వాత, అర లీటరు వేడి నీటిని పోసి, తర్వాత మిరియాలపొడిని చేర్చి, మూత పెట్టి, సుమారు పది నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. పది నిమిషాల తర్వాత, మూత తీసి, ముందుగా తయారుచేసుకున్న ఎండుకొబ్బరి గసగసాల పేస్ట్‌ను వేసి కలపాలి.

పేస్ట్ వేసిన తర్వాత, మళ్ళీ పది నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఇలా చేయడం వలన కర్రీ చిక్కబడుతుంది. అంతే కాకుండా మటన్ కర్రీలా మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పూదీనా చేర్చాలి. అంతే టేస్టీ టేస్టీ వెజ్ మటన్ కర్రీ రెడీ. ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటారు