
చేతులు శుభ్రం చేసుకోవడం: మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే.. టాయిలెట్ వాడిన తర్వాత కచ్చితంగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు.సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలి. అరచేతులు, చేతుల వెనుక భాగం, వేళ్ల మధ్య, గోళ్ల చుట్టూ శుభ్రం చేయడం వల్ల క్రిములు సమర్థవంతంగా తొలగిపోతాయి. అయితే చేతులు కడిగిన తర్వాత టాయిలెట్ డోర్ తెరవడానికి టిష్యూ పేపర్‌ను యూజ్ చేయడం బెటర్. ఒకవేళ నేరుగా తాకినా వెంటనే ఇన్ఫెక్షన్ సోకదని, అయితే ఆ చేతులతో నోరు, ముక్కు, కళ్ళను తాకడం వల్ల తీవ్ర ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైజీన్ కిట్: మీరు ట్రైన్ జర్నీలో ఉన్నప్పుడూ కచ్చితంగా ఓ హైజీన్ కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు అవసరం. మీ వద్ద ఉండే కిట్‌లో కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్, లిక్విడ్ సోప్ లేదా పేపర్ సోప్ స్ట్రిప్స్, టిష్యూలు లేదా టాయిలెట్ పేపర్, వెట్ వైప్స్, చిన్న డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్ ప్యాకెట్, వాడిన టిష్యూలను వేయడానికి డిస్పోజబుల్ బ్యాగ్ ఉండాలి. చేతులు కనిపించేంత మురికిగా లేనప్పుడు మాత్రమే శానిటైజర్ పనిచేస్తుందని, స్పష్టంగా మురికి ఉన్నప్పుడు సబ్బు-నీరు తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేశారు.

ముఖ్యంగా మహిళలు.. పీరియడ్స్ సమయంలో సరైన ప్రణాళిక ఉంటే ప్రయాణం ఏమాత్రం ఇబ్బందికరం కాదని గైనకాలజిస్ట్ డాక్టర్ పావన హెచ్ ఎన్ పేర్కొన్నారు. ట్రైన్ జర్నీలో సరిపడా మెన్‌స్ట్రువల్ ప్రొడక్ట్స్ (ప్యాడ్లు), ఇంటిమేట్ వైప్స్, అదనపు లోదుస్తులు, డిస్పోజబుల్ వేస్ట్ బ్యాగులు వెంట ఉంచుకోవాలి. ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి ప్యాడ్లను మార్చుకోవాలి. మార్చే ముందు, మార్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం కీలకం. అలాగే వాడిన ప్యాడ్లను టాయిలెట్లలో ఫ్లష్ చేయకుండా, కవర్‌లో చుట్టి మాత్రమే డస్ట్‌బిన్‌లో వేయాలని సూచిస్తున్నారు.

ఈ తప్పులు చేయొద్దు: ట్రైన్‌లో ఉన్న ట్యాప్‌లు, డోర్ లాచెస్‌పై క్రిములు ఉండే అవకాశం ఉన్నందున, వీలైతే వాటిని టిష్యూ పేపర్‌తో సహాయంతో మాత్రమే ముట్టుకోండి. అలాగే మీ మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు లేదా ఆహార పదార్థాలను టాయిలెట్ ఉపరితలాలపై పొరపాటున కూడా పెట్టకండి. ఎందుకంటే చేతులను అయితే సబ్బుతో కడుక్కోవచ్చు. కానీ మొబైల్ వంటి వాటిని నీటితో కడగలేవు. అలా అని వాటిని టాయిలెట్ సీటుపై పెట్టి పట్టుకుంటే.. ఆ క్రిములు చేతులకు అంటే ప్రమాదం ఉంది.

రైలు టాయిలెట్లలో నేల తడిగా, మురికిగా ఉంటుంది కాబట్టి చెప్పులు లేకుండా అస్సలు వాష్‌రూమ్‌కు వెళ్లవద్దు.అలాగే టాయిలెట్ కమోడ్ మూత ఉంటే, ఫ్లష్ చేసే ముందే మూత వేయడం మంచి అలవాటు. సీటుకు తిరిగి వచ్చిన తర్వాత చేతులు కడగకుండా ఆహారం ముట్టుకోవడం, ఆహారాన్ని తెరిచి ఉంచడం వంటివి చేయకూడదు. ఇంటి టాయిలెట్లలో ఉండే సౌకర్యం రైలులో లభించకపోయినా, ఈ ప్రాథమిక జాగ్రత్తలు పాటిస్తే ప్రయాణాన్ని ఆరోగ్యవంతంగా, సౌకర్యవంతంగా పూర్తి చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.