
కావలసిన పదార్థాలు: కడిగి 1 గంట నానబెట్టిన పావు కప్పు బియ్యం, 1 కప్పు తాజా పచ్చికొబ్బరి ముక్కలు, 2 నుండి 3 కప్పుల చిక్కటి పాలు , 1 కప్పు బెల్లం తురుము, బెల్లం కరిగించడానికి అర కప్పు నీళ్లు, అర టీస్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, 10 నుండి 15 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ కిస్‌మిస్, కొద్దిగా బాదం / పిస్తా పలుకులు

తయారీ విధానం: పావు కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. నానిన బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి మిక్సీ జార్‌లో వేయాలి. ఇందులోనే ఒక కప్పు తాజా పచ్చికొబ్బరి ముక్కలు, పావు కప్పు నీళ్లు పోసి మరీ బరకగా కాకుండా, నునుపైన పేస్ట్‌లా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై అడుగు మందపాటి గిన్నె పెట్టి 2 నుండి 3 కప్పుల చిక్కటి పాలు పోసి మీడియం మంటపై మరిగించాలి. పాలు పొంగు రాగానే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం-కొబ్బరి పేస్ట్‌ను కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బియ్యం పేస్ట్ ఉడికి 5 నుండి 7 నిమిషాల్లో మిశ్రమం చిక్కబడి చక్కటి క్రీమ్ లాంటి కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు అర టీస్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి, గిన్నెను పక్కన పెట్టి గోరువెచ్చగా చల్లారనివ్వాలి.

వేరొక చిన్న పాత్రలో ఒక కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. తీగపాకం అవసరం లేదు; బెల్లం పూర్తిగా కరిగితే చాలు . బెల్లం కరిగాక స్ట్రైనర్‌తో వడకట్టి పక్కన ఉంచాలి. పాలు-బియ్యం మిశ్రమం బాగా మరిగే వేడి మీద ఉన్నప్పుడు బెల్లం నీళ్లు పోస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది; కాబట్టి పాలు-బియ్యం మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కరిగించిన బెల్లం నీళ్లను పోసి సమంగా కలిసేలా మిక్స్ చేయాలి.

చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్, బాదం పలుకులు వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ నేతి డ్రైఫ్రూట్స్ తాలింపును తిమ్మనంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నోరూరించే పాతకాలపు 'తిమ్మనం' స్వీట్ సిద్ధం! దీనిని గోరువెచ్చగా తిన్నా లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా ఐస్‌క్రీమ్‌లా తిన్నా అమృతతుల్యంగా ఉంటుంది!