
కావలసిన పదార్థాలు: 1 గ్లాసు పొడి బియ్యప్పిండి, పుల్లటి మజ్జిగ 2 గ్లాసులు, 1 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ, 3 నుండి 4 సన్నగా ఎండు మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు, 3 తుంచిన పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ ఆవాలు , అర టీస్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వంట నూనె,

తయారీ విధానం: ఒక గిన్నెలో 1 గ్లాసు బియ్యప్పిండిని తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి.. ఒకటిన్నర గ్లాసుల పుల్లటి మజ్జిగను పోసి ఉండలు ఏమీ లేకుండా విస్కర్ లేదా గరిటెతో బాగా కలపాలి. పిండి చిక్కగా అనిపిస్తే మరో పావు గ్లాసు నుండి అర గ్లాసు వరకు నీరు లేదా మజ్జిగ పోసుకుని పలుచటి జారుడు పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై వెడల్పాటి కడాయి లేదా పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. పప్పులు ఎర్రగా వేగాక తుంచిన ఎండుమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు మృదువుగా, లేత గులాబీ రంగులోకి మారేంత వరకు లో-మీడియం మంటపై మగ్గించాలి.

ఉల్లిపాయలు వేగిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న చల్ల-బియ్యప్పిండి మిశ్రమాన్ని కడాయిలో పోయాలి. పోసే ముందు పిండిని ఒకసారి కలపాలి, అడుగున పిండి తేలిపోకుండా ఉంటుంది. పోసిన వెంటనే ఉండలు కట్టకుండా గరిటెతో ఆపకుండా కలుపుతూనే ఉండాలి.

మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతుంటే నిమిషాల వ్యవధిలోనే పిండి దగ్గరపడటం మొదలవుతుంది. పిండి చక్కగా ఉడికి కడాయి అంచులకు అంటుకోకుండా ముద్దలా విడివడే వరకు నిరంతరం కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే పాతకాలపు గోదావరి 'చల్ల పిండి' సిద్ధం! పుల్లపుల్లగా, కారంగా వేడివేడిగా తింటుంటే నాలుకకు అద్భుతమైన రుచినివ్వడమే కాకుండా.. దీనిపై చెంచాడు నెయ్యి లేదా ఆవకాయ నూనె వేసుకుని తింటే అమృతతుల్యంగా ఉంటుంది !