
భారతీయ వంటకాల్లో చింతపండుకు ప్రత్యేక స్థానం ఉంది. పులుపు, రుచిని అందించే చింతపండు గుజ్జును ఉపయోగించిన తర్వాత చాలామంది దాని గింజలను చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ, సాంప్రదాయ ఆయుర్వేదంలోనూ, ఆధునిక అధ్యయనాల్లోనూ చింత గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నట్లు వెల్లడైంది.

పోషకాల గని - శుద్ధి చేసే విధానం: చింత గింజల్లో ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, పొటాషియం వంటి కీలక ఖనిజాలు నిండి ఉంటాయి. అయితే వీటిని ఎప్పుడూ పచ్చిగా నేరుగా తినకూడదు. పచ్చి గింజలు తీసుకుంటే కడుపునొప్పి, అజీర్తి వస్తాయి. గింజలను పెనంపై దోరగా వేయించి లేదా నానబెట్టి, పైన ఉండే గట్టి పొట్టును తొలగించి దంచి పొడి రూపంలో మాత్రమే వినియోగించాలి.

జీర్ణక్రియ, కొలెస్ట్రాల్ నియంత్రణ: చింత గింజల్లో ఉండే సమృద్ధియైన ఫైబర్ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి దోహదపడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

షుగర్, బిపి అదుపు: చింత గింజలలోని సహజ గుణాలు ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని కాపాడి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి. వీటిలో లభించే పొటాషియం రక్తపోటుని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కీళ్ల నొప్పులు, దంతాల ఆరోగ్యం: చింత గింజల పొడిని క్రమం తప్పకుండా మితంగా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పొడితో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల పంటిపై ఉండే ప్లాక్ తొలగిపోయి చిగుళ్లు దృఢపడతాయి. ఇందుకోసం శుద్ధి చేసిన చింత గింజల పొడిని రోజువారీ పిండి వంటల్లో కొద్దిగా కలపవచ్చు. లేదా సూప్‌లు, చట్నీలు, హెర్బల్ టీ/కాఫీ రూపంలోనూ చిన్న మోతాదులో తీసుకోవచ్చు.