
కావలసిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, ఒకటింపావు కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వంట నూనె, రొట్టెలు ఒత్తుకోవడానికి సరిపడా పొడి రాగిపిండి. తయారీ విధానం: స్టవ్ వెలిగించి కడాయిలో ఒకటింపావు (1.25) కప్పుల నీళ్లు పోయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి.

నీళ్లు మరగడం మొదలవగానే ఒక కప్పు రాగిపిండిని వేయాలి. వెంటనే మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి, గరిటెతో ఉండలు లేకుండా అరగంట నిమిషం పాటు పిండిని ఒత్తుతూ బాగా కలపాలి. పిండి ముద్దలా దగ్గరపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి, మూతపెట్టి పిండి ఆవిరికి మగ్గేలా కొద్దిసేపు వదిలేయాలి.

పిండి పూర్తిగా చల్లారిపోకముందే, చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడే మూత తీసి చేతితో బాగా ఒత్తుతూ కలపాలి. ఇలా వేడిమీద పిసకడం వల్ల పిండికి జిగురు వచ్చి రొట్టెలు ఏమాత్రం విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండిని సాఫ్ట్ ముద్దలా చేసుకుని, కావాల్సిన పరిమాణంలో ఉండలుగా విభజించుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూతపెట్టి ఉంచాలి. రొట్టె చేసేటప్పుడు ఉండను చేతిలో మరోసారి బాగా పిసికి చపాతీ పీటపై పెట్టాలి. పీటపై కొద్దిగా పొడి రాగిపిండి చల్లుకుంటూ రోలింగ్ పిన్‌తో మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైపైన సున్నితంగా పలుచగా ఒత్తుకోవాలి.

రొట్టెలు గుండ్రంగా నీట్‌గా రావడం కోసం షార్ప్ అంచులున్న బాక్స్ మూతతో కట్ చేసుకుని అంచులను తీసేయవచ్చు. స్టవ్‌పై ఐరన్ లేదా నాన్‌స్టిక్ పెనం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాతే రొట్టెను వేయాలి. వేసిన వెంటనే నీళ్లలో ముంచిన తడిబట్టతో రొట్టె పైభాగంపై సున్నితంగా అద్దాలి ఇలా చేయడం వల్ల రొట్టె మరింత సాఫ్ట్‌గా వస్తుంది.

హై ఫ్లేమ్‌పై 10-15 సెకన్లు కాలిన తర్వాత చిన్న బుడగలు రాగానే రొట్టెను రెండో వైపు తిప్పాలి. మరో 15 సెకన్లు కాలాక మళ్లీ తిరగేసి పొడిబట్టతో లేదా గరిటెతో నెమ్మదిగా ఒత్తితే రొట్టె పూరీలా చక్కగా పొంగుతుంది. కాలిన రొట్టెలను నేరుగా ప్లేట్‌లో కాకుండా పొడి కాటన్ బట్టపై లేదా టిష్యూ పేపర్‌పై వేస్తే ఆవిరి వల్ల తడి అవ్వకుండా పొడిగా ఉంటాయి. అంతే, నోరూరించే దూదిలాంటి సూపర్ సాఫ్ట్ రాగి రోటీలు సిద్ధం! ఘాటైన వెజిటబుల్ లేదా నాన్‌వెజ్ గ్రేవీ కర్రీలతో తింటే అమృతంలా ఉంటాయి