
జ్యోతిషశాస్త్రంలో వివిధ యోగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని యోగాలు శుభ ఫలితాలను అందిస్తే.. మరికొన్ని చెడు ఫలితాలను ఇస్తాయి. చెడు ఫలితాలను ఇచ్చే యోగాల సమయంలో ఆ రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో వైధృతి యోగం ఒకటిగా పరిగణిస్తారు. 2026 అక్టోబర్ 11న శరన్నవరాత్రుల తొలి రోజున వైధృతి యోగం ఏర్పడనున్నట్లు జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ యోగం ప్రభావం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు, ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

మిథున రాశి: వైధృతి యోగం సమయంలో మిథున రాశి వారికి కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో అనుకోని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఇంట్లో, బయట కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. చట్టపరమైన వ్యవహారాలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా ముఖ్యమైన ప్రణాళికను అమలు చేసే ముందు దాని సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిశీలించాలి.

కన్య రాశి: కన్య రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగం లేదా వ్యాపారంలో బిజీగా ఉన్నప్పటికీ ఆహారం, విశ్రాంతి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారంలో పూర్తికావాల్సిన కొన్ని పనులు చివరి నిమిషంలో నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడి తీసుకోకుండా, అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబంలో చిన్నచిన్న విషయాల వల్ల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నందున సంయమనం పాటించాలి.

మకర రాశి: మకర రాశి వారికి ఈ సమయం కొంత మేరకు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. వ్యాపార రంగంలో ఒత్తిడి పెరగడం, సహచరులతో చిన్నపాటి విభేదాలు రావడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి సమాచారం తెలుసుకోకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

Disclaimer: ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్య విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడింది. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైనవిగా పరిగణించరాదు.