
తెలుగు క్యాలెండర్ ప్రకారం, సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తుంటాయి. వీటిలో సోమవారం వచ్చే అమావాస్యను ‘సోమవతి అమావాస్య’ అని పిలుస్తారు. హిందూ ధర్మంలో దీని ప్రత్యేకత గురించి విస్తృతంగా వివరించబడింది. ఈ సంవత్సరం జూన్ 15వ తేదీన సోమవతి అమావాస్య వచ్చింది. ఈరోజున చాలా మంది మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా, ఉపవాస దీక్ష కూడా ప్రారంభిస్తారు.

శివుడికి ప్రీతికరమైన సోమవారం వచ్చే అమావాస్య రోజున శివుడిని ఆరాధిస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అంటారు. అలాగే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం, పూజా క్రతువులు చేయడం ద్వారా పితృ దోషం నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. తద్వారా ఆ వ్యక్తి ఇంట్లోని అన్ని సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పెద్దల నమ్మకం.

అయితే, పెళ్లైన ఆడవారు ఈ రోజు కొన్ని పనులు చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. సోమవతి అమావాస్య రోజున ఎవరినీ కించపరచకూడదు, అలాగే అగౌరవంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అంతే కాకుండా ఎవరూ స్మశాన వాటికకు వెళ్లకూడదు. ఒకవేళ అలా వెళ్లినట్లయితే ప్రతికూల శక్తులు మిమ్మల్ని వెంటాడతాయంట.

ముఖ్యంగా ఈ రోజు స్త్రీలు ఇంద్రియ నిగ్రహం పాటించాలి. దంపతులు దూరంగా ఉండాలి. మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు. అలాగే గోర్లు కత్తిరించుకోకూడదు, కటింగ్ చేయించుకోకూడదు. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. పెళ్లైన మహిళలు తప్పకుండా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. లేదంటే భర్తకు కీడు జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)