
October Born Girls Personality Telugu: అక్టోబర్ నెలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శరన్నవరాత్రులు, దసరా వంటి ముఖ్యమైన పండగలు ఈ నెలలోనే వస్తాయి. అయితే ఈ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం కూడా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్‌లో పుట్టిన అమ్మాయిలు కొన్ని ప్రత్యేకమైన స్వభావ లక్షణాలను కలిగి ఉంటారని నమ్మకం. వారి ఆలోచనా విధానం, వ్యక్తిత్వం, బంధాల పట్ల వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకర్షణీయమైన వ్యక్తిత్వం.. ఆత్మవిశ్వాసమే బలం.. అక్టోబర్‌లో జన్మించిన అమ్మాయిలలో సహజమైన ఆకర్షణ కనిపిస్తుందని చెబుతారు. వారి రూపంతో పాటు మాట్లాడే విధానం, ప్రవర్తించే తీరు కూడా ఇతరులను ఆకట్టుకుంటాయి. ఎక్కడికి వెళ్లినా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటారు. ఎక్కువగా మాట్లాడకపోయినా.. వారి వ్యక్తిత్వం చుట్టూ ఉన్నవారి దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెంటనే భయపడిపోవడం వీరి స్వభావం కాదని జ్యోతిష్య విశ్వాసం. సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోకుండా పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. తమపై తమకు ఉన్న నమ్మకంతో క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగుతారు.

స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు.. అక్టోబర్ అమ్మాయిలకు తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా గడపడం అంటే ఇష్టమని చెబుతారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం, విభిన్నమైన అనుభవాలను ఆస్వాదించడం పట్ల ఆసక్తి చూపుతారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పటికీ.. తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని కోరుకుంటారు.

సౌకర్యాలకు ప్రాధాన్యత.. బంధాలకు ఎంతో విలువ.. అందమైన వస్తువులు, మంచి జీవనశైలి, సౌకర్యవంతమైన వాతావరణం అంటే వీరికి ఇష్టం. తమకు నచ్చిన వస్తువులు, అనుభవాల కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. అయితే డబ్బును కేవలం చూపు కోసం కాకుండా.. తమ జీవితం మరింత ఆనందంగా, సౌకర్యంగా ఉండేందుకు ఉపయోగించుకోవాలని భావిస్తారు. స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాల విషయంలో అక్టోబర్‌లో పుట్టిన అమ్మాయిలు చాలా సీరియస్‌గా ఉంటారని చెబుతారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే.. వారితో చివరి వరకు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. తమకు దగ్గరైన వారి కష్టసుఖాల్లో అండగా నిలబడతారు. అయితే నమ్మకాన్ని ఎవరైనా దెబ్బతీస్తే మాత్రం సులభంగా క్షమించరు.

మనసులో మాట దాచుకోరు.. అన్యాయం కనిపిస్తే ఊరుకోరు.. తమ భావాలను బయటపెట్టడంలో వీరు పెద్దగా సంకోచించరని నమ్మకం. సంతోషం, బాధ, ప్రేమ, అసంతృప్తి.. ఏదైనా సరే సందర్భాన్ని బట్టి స్పష్టంగా వ్యక్తపరుస్తారు. అందుకే కొన్నిసార్లు వీరు చాలా సూటిగా మాట్లాడుతున్నారని ఇతరులకు అనిపించవచ్చు. కానీ వారి మనసులో దాపరికం మాత్రం తక్కువగా ఉంటుంది. అక్టోబర్ అమ్మాయిలలో సున్నితమైన మనసుతో పాటు బలమైన వ్యక్తిత్వం కూడా ఉంటుందని చెబుతారు. తమకు లేదా తమకు నచ్చిన వారికి అన్యాయం జరిగితే మౌనంగా ఉండరు. తప్పు అనిపిస్తే ధైర్యంగా ప్రశ్నిస్తారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు వెనుకాడరు.

భావోద్వేగాలు ఎక్కువ.. కానీ నియంత్రణ కూడా తెలుసు.. వీరు భావోద్వేగాలకు త్వరగా స్పందించే స్వభావం కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా తమకు ఎంతో ముఖ్యమైన వ్యక్తుల విషయంలో వారి భావాలు మరింత బలంగా ఉంటాయి. అయితే కాలక్రమేణా భావోద్వేగాలను నియంత్రించుకోవడం, పరిస్థితికి అనుగుణంగా స్పందించడం నేర్చుకుంటారు. అందుకే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం వీరిలో ఉంటుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. (Disclaimer: పుట్టిన నెల ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలను నిర్ణయించడం శాస్త్రీయంగా నిర్ధారిత పద్ధతి కాదు. ఇవి జ్యోతిష్య, ప్రజా విశ్వాసాల ఆధారంగా చెప్పే సాధారణ లక్షణాలు మాత్రమే. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)