
Karkataka Rashilo Kuja Sancharam: నవగ్రహాల్లో కుజుడిని ధైర్యం, శౌర్యం, బలం, పరాక్రమానికి ప్రతీకగా పరిగణిస్తారు. మేషం, వృశ్చిక రాశులకు అధిపతిగా ఉన్న కుజుడు సాధారణంగా ఒక రాశిలో సుమారు 45 రోజుల పాటు సంచరిస్తాడు. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 12 వరకు కుజుడు కర్కాటకంలోనే కొనసాగనున్నాడు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం.. కుజుడు, చంద్రుడి స్వభావాలు భిన్నంగా ఉంటాయి. ఈ రెండు గ్రహాల ప్రభావం కలిసినప్పుడు కొందరికి భావోద్వేగాలు, ఆలోచనలు, నిర్ణయాల విషయంలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతారు.

ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకంలో కుజుడి సంచారం కారణంగా ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

మేషరాశి.. కుజుడు మేషరాశికి నాలుగో ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ ప్రభావంతో ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇతరులను అతిగా నమ్మడం మంచిది కాదు. పనులను తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనతో తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా సులభమైన మార్గాల కోసం నియమాలను ఉల్లంఘించడం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. లేదంటే అనవసరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వివాహ సంబంధిత విషయాల్లోనూ కొంత ఆలస్యం లేదా ఆటంకాలు రావచ్చు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు దాని లాభనష్టాలను పూర్తిగా పరిశీలించడం మంచిది. ఉద్యోగం చేస్తున్నవారు ఈ సమయంలో ఎదురయ్యే ఒత్తిళ్లు లేదా సమస్యల కారణంగా ఉద్యోగం మారాలని ఆలోచించే అవకాశం ఉంది. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

కర్కాటకరాశి.. కుజుడు కర్కాటక రాశిలోనే, అంటే మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. ఇది కుటుంబ సభ్యులతో చిన్నపాటి అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సహోద్యోగులు లేదా ఇతరులతో పోటీ పెరగవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి చిన్న విషయాలే అపార్థాలకు కారణమయ్యే అవకాశం ఉంది. అందువల్ల భావోద్వేగాలకు లోనుకాకుండా, భాగస్వామితో స్పష్టంగా మాట్లాడటం మంచిది.

కన్యారాశి.. కుజుడు కన్యారాశికి 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ ప్రభావంతో ఆదాయం లేదా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ.. అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక పరిస్థితిని సమతుల్యంగా ఉంచుకోవడానికి ఖర్చులపై నియంత్రణ అవసరం. కొన్ని విషయాల్లో కోర్టు కేసులు లేదా ఇతర న్యాయపరమైన వ్యవహారాల కారణంగా ఎక్కువగా తిరగాల్సి రావచ్చు. ఈ సమయంలో ఏ పనినీ తొందరపడి చేయకూడదు. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. అదృష్టంపై పూర్తిగా ఆధారపడకుండా.. ప్రతి పనినీ ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో రిస్క్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అవసరం. (Disclaimer: ఈ కథనంలోని ఫలితాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా చెప్పబడినవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత జాతక పరిస్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)