
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు ద్వాదశ రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంటాయి. కొన్నిసార్లు గ్రహాల సంచారం వల్ల ప్రత్యేక రాజయోగాలు కూడా ఏర్పడుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక రాజయోగం గురించి తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్రుడు తొమ్మిది గ్రహాలలో రాక్షసులకు గురువుగా ప్రసిద్ధి. శుక్రుడు అందం, ప్రేమ, విలాసం, సంపద, కళలు, శ్రేయస్సుకు కారకుడిగా భావించబడతాడు. వృషభం, తులా రాశులకు అధిపతి అయిన శుక్రుడు తన స్థానం మార్చిన ప్రతిసారి అన్ని రాశుల జీవితాలపై ప్రభావం చూపుతాడు. 2026 మార్చి 1న శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో శని కూడా ఇప్పటికే మీనరాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల, ఈ రెండు గ్రహాల కలయికతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.

శని ధర్మం, క్రమశిక్షణ, కష్టపడి సాధించడం వంటి గుణాలకు ప్రతీక. శుక్రుడు, శని కలిసినప్పుడు శ్రమకు ఫలితం, స్థిరమైన సంపద, గౌరవం లభించే అవకాశం ఉంటుంది. ఈ రాజయోగం ప్రభావం అన్ని 12 రాశులపై కనిపించినా.. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అధిక లాభాలు చేకూరుతాయి.

మేష రాశి.. మేష రాశివారికి ఈ రాజయోగం 12వ ఇంట్లో ఏర్పడుతుంది. దీని ప్రభావంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో ఆనందకరమైన సమయం గడపగలుగుతారు. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. శుక్ర అనుగ్రహంతో విలాసవంతమైన జీవితం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. విదేశీ అవకాశాలు కూడా కలగవచ్చు.

వృషభ రాశి.. వృషభ రాశివారికి ఈ రాజయోగం 11వ ఇంట్లో ఏర్పడుతుంది. దీని వల్ల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక లాభాలు, ముఖ్యంగా వ్యాపారాల్లో, ఎగుమతి–దిగుమతి రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతవృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. కుటుంబంతో సంతోషకర సమయం గడుస్తుంది.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశివారికి ఈ రాజయోగం 3వ ఇంట్లో ఏర్పడుతుంది. దీని కారణంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది.

మొత్తానికి, మీనరాశిలో శుక్రుడు–శని కలయికతో ఏర్పడే ఈ కేంద్ర త్రికోణ రాజయోగం కష్టానికి ఫలితం, ఆర్థిక స్థిరత్వం, గౌరవం, సుఖసంతోషాలను అందించే సమయంగా భావించవచ్చు. అయితే వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)