
జ్యోతిష్య శాస్త్రంలో గురు (బృహస్పతి) గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గురు గ్రహాన్ని దేవతల గురువుగా భావిస్తారు. గురుడిని సంపద, అదృష్టం, విద్య, వివాహం, సంతానం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. అందుకే గురు గ్రహం రాశి మారినప్పుడు 12 రాశుల వారి జీవితాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. సాధారణంగా గురుడు ఒక రాశిలో సుమారు ఏడాది పాటు సంచరిస్తాడు. అయితే 2027లో గురు గ్రహం మూడు సార్లు తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ గ్రహ సంచారాల ప్రభావంతో ముఖ్యంగా ఐదు రాశుల వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

మిథున రాశి: 2027లో గురు సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మంచి అవకాశాలు దక్కుతాయి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా.. తొందరపాటుతో కాకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం అవసరం.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి 2027లో గురుడి సంచారం విశేషంగా కలిసిరానుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు.. ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడే అవకాశముంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

సింహ రాశి:ఈ రాశి వారికి గురు గ్రహ సంచారం ఆర్థికంగా ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే డబ్బు సంపాదించడమే కాకుండా పొదుపుపైనా దృష్టి పెట్టడం మంచిది. సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందుతారు.

కన్య రాశి: ఈ రాశి వారికి 2027లో గురు సంచారం సానుకూల ఫలితాలను అందించనుంది. ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కెరీర్లో పురోగతికి కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు అనుకూలమైన మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి గురుడి సంచారం శుభప్రదంగా ఉండనుంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. పరిశోధన, విశ్లేషణాత్మక రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, పనులు అప్పగించే సూచనలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. (గమనిక: ఇవి జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చెప్పబడిన అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయి. ఈ జ్యోతిష్య అంచనాలు నిజమని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు)