
Gajakesari Yoga Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలు, మానసిక స్థితి, సౌకర్యాలకు కారకుడిగా పరిగణిస్తారు. చంద్రుడు అత్యంత వేగంగా సంచరించే గ్రహాల్లో ఒకటి. సుమారు రెండున్నర రోజులకు ఒకసారి రాశిని మారుస్తాడు. అందువల్ల చంద్రుడి రాశి మార్పు వ్యక్తుల ఆలోచనలు, భావోద్వేగాలతో పాటు జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నమ్మకం. ఈ క్రమంలో అక్టోబర్ 4న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ప్రత్యేకమైన గ్రహ సంయోగం ఏర్పడుతుంది. ఇప్పటికే కర్కాటక రాశిలో ఉన్న గురు గ్రహంతో చంద్రుడు కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ యోగాన్ని సంపద, వృత్తి, గౌరవం, శ్రేయస్సుకు అనుకూలమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి.. ఈ రాశి వారికి వృత్తి, ఆర్థిక రంగాల్లో సానుకూల మార్పులు రావచ్చు. పనిలో ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభించే అవకాశం ఉంది. పదోన్నతికి మార్గాలు తెరుచుకోవచ్చు. వ్యాపారులు లాభాలను పెంచుకునేందుకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం లేదా అనుకోని ఆర్థిక ప్రయోజనం కలగడం వంటి ఫలితాలు ఉండవచ్చు.

కర్కాటక రాశి.. ఈ రాశిలోనే చంద్రుడు సంచరించడంతో ఈ రాశివారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగవచ్చని జ్యోతిష్య నమ్మకం. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సౌకర్యాలు, సంతోషం పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపించవచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

మేష రాశి.. ఈ రాశి వారికి ఈ గురు-చంద్రుల సంయోగం ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు లభించవచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పదోన్నతి లేదా జీతం పెంపుపై శుభవార్త అందవచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభించడంతో పాటు పెద్ద సంస్థలు లేదా విదేశీ కంపెనీలతో చేసే పనుల ద్వారా లాభాలు రావచ్చు.

మీన రాశి.. ఈ రాశి వారికి గురు-చంద్రుల సంయోగం ఆర్థికంగా, వృత్తిపరంగా శుభప్రదంగా ఉండవచ్చు. ఉద్యోగులకు విదేశీ సంబంధిత అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు కలిసిరావచ్చు. ప్రతిష్ట పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకూల ఫలితాలు లభించవచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన నిధులు తిరిగి అందే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య నమ్మకం. (Disclaimer: ఈ కథనంలోని విషయాలు వేద జ్యోతిషశాస్త్రంలో ఉన్న నమ్మకాలు, అంచనాల ఆధారంగా ఇచ్చిన వివరాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)