
జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురు గ్రహం, చంద్రుడి కలయికతో ఏర్పడే ఈ యోగం శుభప్రదమైనదిగా జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. ఈ యోగం జ్ఞానం, ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆర్థిక పురోగతికి సంకేతంగా భావిస్తారు. నవంబర్ 2, 2026న చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే సింహ రాశిలో గురు గ్రహం ఉండటంతో గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో నాలుగు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం, గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు పొందడం, ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడం వంటి విషయాల్లో అనుకూలత పొందుతారు. ఆ 4 రాశుల వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి గజకేసరి యోగం విద్య, కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలను అందించే అవకాశముంది. ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లభిస్తుంది. విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లేదా కెరీర్లో ముందుకు వెళ్లేందుకు అవకాశాలు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి గజకేసరి యోగం కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు, మాటతీరుకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. మీ మాటతీరు విధానం ఇతరులను ఆకట్టుకుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశముంది. కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారు ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆర్థికంగా కొంత ఉపశమనం లభించే పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన పెరగడంతో పాటు వివాహితుల జీవితంలో అన్యోన్యత మెరుగుపడే అవకాశం ఉంది.

సింహ రాశి: సింహ రాశిలోనే గజకేసరి యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశముంది. ఉద్యోగులు తమ బాధ్యతలను మరింత చురుగ్గా నిర్వహిస్తారు. కొందరికి వేతన పెంపు లేదా ఆదాయాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు లభిస్తాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నవారు ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకొస్తారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా పరిస్థితులను అంచనా వేయడం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి గజకేసరి యోగం వృత్తి, ఉద్యోగ రంగాల్లో పురోగతికి దోహదపడే అవకాశం ఉంది. కార్యాలయంలో ఎదురవుతున్న సమస్యలు తగ్గే అవకాశముంది. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారులు తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. పెట్టుబడులు పెట్టేవారు మార్కెట్ పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తూ క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరించడం మంచిది. (గమనిక: ఈ కథనం జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. గ్రహయోగాల వల్ల ధనలాభం లేదా ఉద్యోగ పురోగతి తప్పనిసరిగా జరుగుతుందని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు.)