
Eye Twitching Meaning Telugu: కన్ను అకస్మాత్తుగా అదరడాన్ని చాలామంది గమనించే ఉంటారు. కొన్నిసార్లు కొన్ని సెకన్లలోనే ఆగిపోయే ఈ ప్రకంపనలు, మరికొన్నిసార్లు ఎక్కువసేపు కొనసాగుతుంటాయి. సాధారణంగా కన్ను అదరడాన్ని అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో ముడిపెడతారు. అయితే, సముద్రిక శాస్త్రం, సంప్రదాయ నమ్మకాల ప్రకారం కుడి కన్ను, ఎడమ కన్ను అదరడానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా స్త్రీలు, పురుషుల విషయంలో వీటి ఫలితాలు భిన్నంగా ఉంటాయని విశ్వసిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

పురుషుడి కుడి కన్ను అదిరితే ఏమవుతుంది?.. సముద్రిక శాస్త్రంలోని కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం, పురుషుడి కుడి కన్ను అదరడం శుభసూచకంగా భావిస్తారు. ఇది త్వరలో మంచి వార్త వినడం, ఉద్యోగంలో పురోగతి సాధించడం లేదా వ్యాపారంలో లాభాలు పొందడాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అలాగే, చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తికావడం, రావాల్సిన డబ్బు చేతికి అందడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని విశ్వసిస్తారు.

పురుషుడి ఎడమ కన్ను అదిరితే అర్థం ఏమిటి?.. పురుషుడి ఎడమ కన్ను అదరడాన్ని కొన్ని నమ్మకాల ప్రకారం అశుభ సూచనగా పరిగణిస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవడం, కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావడం లేదా మానసిక ఒత్తిడికి గురికావడం వంటి వాటితో దీనిని ముడిపెడతారు. అందుకే కొత్త పనులు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కొందరు సూచిస్తారు.

స్త్రీల ఎడమ కన్ను అదిరితే ఏమవుతుంది?.. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, స్త్రీల ఎడమ కన్ను అదరడం శుభప్రదంగా భావిస్తారు. ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడం, శుభవార్త వినడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి పరిణామాలకు సంకేతమని నమ్ముతారు. అలాగే, చాలాకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరడం లేదా నిలిచిపోయిన పనులు పూర్తికావడాన్ని సూచిస్తుందని చెబుతారు.

స్త్రీల కుడి కన్ను అదిరితే అర్థం ఏమిటి?.. స్త్రీల కుడి కన్ను అదరడాన్ని కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం అశుభ సూచనగా పరిగణిస్తారు. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు, పనుల్లో ఆలస్యం లేదా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమనే సంకేతంగా భావిస్తారు. అయితే, కన్ను అదిరినంత మాత్రాన చెడు జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. (Disclaimer: ఈ కథనంలోని వివరాలు సముద్రిక శాస్త్రం, సంప్రదాయ విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాత్రమే. కన్ను అదరడానికి సాధారణంగా అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలు ఉండవచ్చు. ఇది తరచుగా వస్తున్నా, ఎక్కువకాలం కొనసాగుతున్నా లేదా ఇతర లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించడం మంచిది.)