
Chanakya Niti In Telugu: ఆర్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, దౌత్యవేత్తగా ప్రసిద్ధి చెందాడు. ఆయన రచించిన ‘చాణక్య నీతి’ గ్రంథంలో మనిషి జీవితానికి ఉపయోగపడే ఎన్నో విలువైన విషయాలను వివరించారు. ముఖ్యంగా ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎలాంటి వ్యక్తులతో శత్రుత్వం పెట్టుకోకూడదు? అనే విషయాలపై చాణక్యుడు కీలక సూచనలు చేశారు. కొందరు వ్యక్తులతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుండా, వారితో అనవసరమైన విభేదాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరి చాణక్య నీతి ప్రకారం ఎవరితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడదో తెలుసుకుందాం.

మీ రహస్యాలు తెలిసిన వ్యక్తులు.. మీ వ్యక్తిగత విషయాలు, బలహీనతలు, రహస్యాలు పూర్తిగా తెలిసిన వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎందుకంటే వారు మీకు సంబంధించిన విషయాలను ఇతరులకు వెల్లడిస్తే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి వ్యక్తులతో సంబంధాలను జాగ్రత్తగా కొనసాగించాలని చాణక్య నీతి సూచిస్తుంది.

జ్ఞానులు.. జ్ఞానం, అనుభవం ఉన్న వ్యక్తులతో విభేదాలు పెట్టుకోవడం మంచిది కాదు. అలాంటి వారి సాంగత్యం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వారితో శత్రుత్వం పెట్టుకుంటే విలువైన జ్ఞానాన్ని, మంచి మార్గదర్శకత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

శ్రేయోభిలాషులు.. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులే శ్రేయోభిలాషులు. కష్టసమయాల్లో అండగా నిలుస్తూ, తప్పులు చేసినప్పుడు సరిదిద్దే ఇలాంటి వారితో ఎప్పుడూ విభేదాలు పెంచుకోకూడదు. వారి సలహాలు, సహకారం మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఆయుధాలు కలిగిన వ్యక్తులు.. ఆయుధాలు కలిగిన వ్యక్తులతో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ప్రమాదకరమని చాణక్య నీతి చెబుతుంది. కోపం లేదా ఆవేశంతో వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అందుకే అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండటం, సంయమనం పాటించడం మంచిది.

మీకంటే బలవంతులైన వ్యక్తులు.. శక్తి, అధికారం, ఆర్థిక స్థోమత విషయంలో మీకంటే బలంగా ఉన్న వ్యక్తులతో ఆలోచించకుండా శత్రుత్వం పెంచుకోవద్దని చాణక్యుడు సూచించాడు. అలాంటి వారితో నేరుగా తలపడటం వల్ల అనవసరమైన సమస్యలు ఎదురుకావచ్చు. పరిస్థితులను అర్థం చేసుకుని తెలివిగా వ్యవహరించడం అవసరం. చివరగా, ప్రతి ఒక్కరితోనూ పోటీ పడటం, చిన్న విషయాలకే శత్రుత్వం పెంచుకోవడం తెలివైన పని కాదు. ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకోవడం కూడా జీవితంలో విజయానికి ముఖ్యమైన లక్షణం. ఆవేశం కంటే ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తూ, అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలని చాణక్య నీతి మనకు బోధిస్తుంది. (Disclaimer: ఈ కథనం చాణక్య నీతిలోని బోధనలు, ప్రాచీన నమ్మకాలు, ప్రచారంలో ఉన్న భావాల ఆధారంగా రూపొందించబడింది. వీటిని కేవలం జీవిత మార్గదర్శక సూచనలుగా మాత్రమే పరిగణించాలి.)